● శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు
● నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి హైందవులకు మహాపర్వదినం. దీన్ని ‘శయనైకాదశి, ప్రథమ ఏకాదశి’ కూడా అని పిలుస్తారు. క్షీరాబ్దిలో శేషపాన్పుపైన శ్రీమహావిష్ణువు శయనించడం (యోగానిద్ర) వల్ల దీన్ని శయనైకాదశి అంటారు. ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. మోక్షాన్ని ఇచ్చే మాసం ఆషాఢం. ఈ రోజు నుంచి ఉత్తరం ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. శనివారం నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతాలు’ ప్రారంభిస్తారు. ఏకాదశి 11 సంఖ్యకు సంకేతం. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనస్సు వెరసీ పదకొండింటిపైన నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం. ఈ రోజు నుంచే పండుగలు ప్రారంభమవుతాయి. రాబోయే శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే వ్రతాలు, నోములు బాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, దాని తర్వాత దేవినవరాత్రులు, దసరా, దీపావళి ఇలా ఎన్నో పండుగలకు ఈ చాత్మురాస్యం ప్రత్యేకం.
విశేష అభిషేకాలు
తొలి ఏకాదశికి దేవాలయాల్లో ఎక్కాహం (ఉపవాసం జాగరణలు), అభిషేకాలు చేపడుతారు. ఎక్కాహం అంటే 24 గంటలపాటు ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం ఎప్పుడైతే ప్రారంభిస్తారో.. మరునాడు అదే సమయం వరకు నిరంతరం భక్తి భజనలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
తొలి ఏకాదశి పూజలకు నగరంలోని పలు ఆలయాలు ముస్తాబయ్యాయి. స్థానిక పిల్లలమర్రి రోడ్డు శ్రీవేంకటేశ్వర దేవాలయం, సింహగిరిలోని లక్ష్మీనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశి పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ గుడి, పాత శివాలయం, బండ్లగేరి ప్రాంతంలోని శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయం, టీచర్స్ కాలనీ రామాలయం తదితర ఆలయాల్లో శనివారం తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరపనున్నారు.
ఎంతో విశిష్టత..
తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. వచ్చే పండుగలకు ప్రారంభసూచిక తొలిఏకాదశి. తొలిఏకాదశి రోజు నుంచే చాతుర్మస్యం దీక్ష ప్రారంభమవుతోంది. చాతుర్మసం దేవతా పూజలకు నిలయమైనది. ఈ చాతుర్మస్యం నాలుగు నెలల్లో ఒక్కొ నెల ఒక వ్రతాచరణ ఉంటుంది. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం అత్యంత పుణ్యప్రదమైనది.
– తోటపల్లి శ్రీకాంత్‌శర్మ, అధ్యక్షుడు,
శ్రీవెంకటేశ్వర సేవా మండలి


