మహబూబాబాద్ అర్బన్: ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు పెంచేలా చర్యలు తీ సుకుంటున్నారు. ఇందుకోసం విద్యార్థులకు ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహిస్తూనే, చదువుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గత సంవత్సరం ఫలితాల్లో 30వ స్థానం..
గత విద్యాసంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా అత్యంత వెనుకబడి 30వ స్థానంలో నిలిచింది. 2025–2026 సంవత్సరంలో ప్రత్యేక తరగతులు నిర్వహించినప్పటికీ ఆశించినస్థాయిలో ఫలితాలు సాధించలేదు. ప్రథమ సంవత్సరంలో 48 శాతం, ద్వితీయ సంవత్సరంలో 65శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
గ్రూపులుగా విభజన..
జిల్లాలో 10ప్రభుత్వ కళాశాలలు ఉండగా, వాటిలో 2,684 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎప్పటికప్పుడు రివిజన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వారి చదువు సామర్థ్యాలను బట్టి మూడు విభాగా లుగా విభజించి పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన విద్యార్థులను గ్రూప్–ఏ, మధ్యస్థ విద్యార్థులను గ్రూప్ బీ, వెనుకబడిన విద్యార్థులను గ్రూప్–సీగా విభజించారు. వెనుకబడిన విద్యార్థులపై నిరంతరం దృష్టి సారించి వారిని గ్రూప్–ఏ విద్యార్థులతోపాటు చదివేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ప్రతీవా రం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్దనున్నారు.
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం..
ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం కోసం ఇంటర్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. – విజయకుమారి, డీఐఈఓ
ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
సామర్థ్యాన్ని బట్టి ఏ,బీ,సీ
గ్రూపులుగా విభజన
వెనుకబడిన విద్యార్థులపై
నిరంతర పర్యవేక్షణ


