గ్రామాల్లో చిరుతల భజనకు పెరుగుతున్న ఆదరణ
● వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మికత
● జానపద కళారూపానికి ప్రాణం పోస్తున్న కళాకారులు
సాక్షి, మహబూబాబాద్: ‘రండి పుణ్యాత్ములారా.. శ్రీ రంగని భజనకు.. రండి ధర్మాత్ములారా శ్రీ రంగని భజనకు’ అంటూ పాటలు పాడుతూ లయబద్ధంగా చిందులు తొక్కుతూ.. హావభావాలు ప్రదర్శిస్తూ మూడు దశాబ్దాల క్రితం రాత్రి వేళ అఖండ దీపం.. కర్రతో చేసిన చిరుతలు పట్టుకొని ఇల్లిల్లూ తిరిగేవారు జానపద కళాకారులు. వారి కాళ్లకు నీళ్లుపోసి.. అఖండ దీపంలో నూనె పోసి, సంభావన ఇచ్చి ప్రోత్సహించే వారు గ్రామీణులు. అనంతరం కళాకారులు ప్రధాన కూడళ్ల వద్ద భజన, జడ కొప్పులు, రామాయణ, మహాభారతం, భాగవతంలోని సన్నివేశాలు చెబుతూ భజన చేసేవారు. జనం గుమిగూడి ఆలకించేవారు. భజన పాటలు విని శారీరక శ్రమ మరిచి.. హాయిగా నిద్రపోయేవారు. కాలం మారింది. సాంకేతికత కారణంగా భజనలకు ఆదరణ కరువైంది. ఈక్రమంలో అంతరించిపోతున్న ఈ కళకు జీవం పోస్తున్నారు జిల్లాకు చెందిన జానపద కళాకారులు.
ఆకట్టుకుంటున్న కళ..
ఒకప్పుడు దైవభక్తితో దేవున్ని ప్రార్థిస్తూ ఆడే చిరుతల భజన.. ఇప్పుడు మలి దశలో భక్తి భావంతోపాటు.. శారీరక వ్యాయామానికి దోహదపడుతోంది. అప్పుడు శ్రమను మరిచి పోయేందుకు భజనలు ఆడగా.. ఇప్పుడు శారీరక శ్రమ లేక చెమట చుక్క రాలక.. పెరిగిన ఉబకాయం, బీపీ, షుగర్లకు దివ్య ఔషధంగా మారుతోంది. దీంతో ఆడ, మగ తేడా లేకుండా గ్రామాల్లో దేవాలయాల వద్ద చిరుతల భజన, కోలాటం వంటి ఆటలకు ప్రాధాన్యం పెరిగింది. పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ కళ ఆకట్టుకుంటోంది.
పూర్వ వైభవం దిశగా..
అంతరించే దశకు చేరిన చిరుతల భజన కళకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు జిల్లాలోని కంబాలపల్లి, కేసముద్రం, రామన్నగూడెం, డోర్నకల్, తొర్రూరు. గుండెపుడి,. గ్రామాల కళాకారులు. కళను బతికించేందుకు కష్టపడుతున్న తమను ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.


