ములుగు: పట్టుదల ఉంటే పేదరికం ప్రగతికి అడ్డుకాదని నిరూపించారు మలుగు జిల్లావాసి, తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ డి.రమేశ్. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, వృత్తి నైపుణ్యం, దేశ భద్రతకు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న ఆయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం–2026 ప్రకటించింది.
వ్యవసాయ కూలీ నుంచి..
ములుగు జిల్లా వెంకటాపూర్ (ఎం) మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దండుగుడు గౌరి లక్ష్మీ, మల్లయ్య కుమారుడు రమేశ్ వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించారు. ప్రైవేట్ టీచర్‌గా, ఆర్‌ఎంపీ వైద్యుడిగా, ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా, న్యూస్ రిపోర్టర్‌గా, లైబ్రరీ అసిస్టెంట్‌గా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ వృత్తుల్లో పనిచేసినప్పటికీ సంతృప్తి చెందలేదు. జీవితంలో ఏదైనా సాధించాలనే సంకల్పంతో 1995లో పోలీస్‌శాఖలో ఎస్సైగా కొలువుకొట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎస్పీ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
105 ప్రశంసపత్రాలు.. పలు పతకాలు
తన సుదీర్ఘ పోలీస్ ప్రస్థానంలో ఎస్పీ రమేశ్ ఇప్పటివరకు 105 ప్రశంసపత్రాలు, సేవా పతకాలు అందుకున్నారు. 2010లో ముఖ్యమంత్రి శౌర్య ప తకం, 2018లో తెలంగాణ పోలీస్ సేవా పతకం, 2024లో ఇండియన్ పోలీస్ మెడల్ పతకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. తాజాగా అతి ఉత్కృష్ట సేవా పతకం ఆయన కీర్తి కిరీటంలో మరో జాతీయ గౌరవంగా చేరింది. 2022 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ప్రపంచ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సదస్సులో పాల్గొనడం ఆయన వృత్తి ప్రస్థానంలో మరో మైలురాయి.
విద్యార్థులు లక్ష్యాలతో ముందుకు సాగాలి..
విద్యార్థి దశనుంచే క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకోవడంతోపాటు సామాజిక విలువలు, హక్కులు, చట్టాలపై విద్యార్థులు, యువత అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎవరెస్ట్ అధిరోహకులు పూర్ణ, ఆనంద్ పేర్లతో ఏటా గోల్డ్ మెడల్స్ అందిస్తున్నా. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు పుట్టిన ఊరిని, చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా నిరుపేదలకు అండగా నిలవాలి.
– రమేశ్, ఇంటెలిజెన్స్ ఎస్పీ
యువతకు రోల్‌మోడల్‌గా ఇంటెలిజెన్స్ ఎస్పీ రమేశ్
విశిష్ట సేవలకు గుర్తింపుగా సీఎం రేవంత్‌రెడ్డి ఇండియన్
పోలీస్ మెడల్ పతకం ప్రదానం
ఇటీవల అతి ఉత్కృష్ట సేవా పతకం ప్రకటించిన కేంద్రం


