సాక్షిప్రతినిధి, వరంగల్/భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని భీమ్‌ఘన్‌పూర్ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. చెరువు అభివృద్ధి, కాల్వల ఆధునికీకరణ, కట్ట పటిష్టత, నీటి నిర్వహణకు సంబంధించిన వివిధ నిర్మాణ పనుల కోసం రూ.21.62 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 75 రకాల పనులను బిల్లాఫ్ క్వాంటిటీస్ (బీఓక్యూ)లో పొందుపరిచింది. ఇందులో ప్రధానంగా కాల్వలకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, రాతి పిచింగ్, డ్రెయిన్ల నిర్మాణం, స్పిల్‌వే, స్లూయిస్ నిర్మాణాలకు సంబంధించిన పనులు ఉ న్నాయి. సాగునీటి వసతుల అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న ఈ పనులకు సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల టెండర్ల గడువు ముగి యగా, త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు.
చెరువుకు సంబంధించిన కాల్వల అభివృద్ధిలో భాగంగా 75 మిల్లీమీటర్ల మందంతో సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ వేయనున్నారు. రెండు పనుల కింద కలిపి 27,239 చదరపు మీటర్ల విస్తీర్ణంలో లైనింగ్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ.1.73 కోట్ల మేర అంచనా వ్యయం కేటాయించారు. కాంక్రీట్ లైనింగ్ దెబ్బతినకుండా ఉండేందుకు నిర్మాణ, కాంట్రాక్షన్ జాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. సుమారు 26,954 మీటర్ల మేర ఈ పనులు చేపట్టేలా ప్రతిపాదించారు. కాలువల్లో నీటి ప్రవాహం, నీటి లీకేజీ నియంత్రణకు సంబంధించిన పనులపైనా దృష్టి సారించారు. ఇందులో భాగంగా 100 మిల్లీమీటర్ల వ్యాసం, 300 మిల్లీమీటర్ల పొడవున్న ప్రీకాస్ట్ పోరస్ సీసీ ప్లగ్‌లను 4,461 ఏర్పాటు చేయనున్నారు. సుమారు 4,461 మీటర్ల మేర డ్రెయిన్ల నిర్మించనున్నారు.
చెరువు కట్ట, సర్‌ప్లస్ ఛానల్ రక్షణకు రాతి పిచింగ్ పనులు చేపట్టనున్నారు. 30 సెంటీమీటర్ల మందంతో డ్రై రబ్బుల్ స్టోన్ పిచింగ్ చేయనున్నారు. కొత్తగా సుమారు 24,772 చదరపు మీటర్ల మేర పిచింగ్ పనులు ప్రతిపాదించారు. వీటిలో ప్రధాన పనికి రూ.1.85 కోట్లు, మరో పనికి రూ.29.95 లక్షలు కేటాయించారు. అదనంగా దెబ్బతిన్న పాత రాతి పిచింగ్‌ను తొలగించి తిరిగి అమర్చేందుకు రూ.3.43 లక్షలు అంచనా వేశారు. కట్ట పటిష్టత కోసం మట్టితో ఎంబాంక్‌మెంట్ నిర్మాణం, మురుము మట్టి నింపడం, కట్‌ఆఫ్ ట్రెంచ్ పనులు చేపట్టనున్నారు. పాత కట్టను కొత్త నిర్మాణంతో అనుసంధానించే బెంచింగ్ పనులూ ఉన్నాయి. అవసరమైన చోట్ల మట్టి తవ్వకం, తరలింపు, పొరలుగా నింపడం, రోలర్లతో గట్టిపరచడం వంటి పనులు చేయనున్నారు. అయితే టెండర్ల పరిశీలన, కాంట్రాక్టు కేటాయింపు, పనులు ప్రారంభించే తేదీ, పనులు పూర్తి చేయాల్సిన గడువు వివరాలు ఈ బీఓక్యూ పత్రంలో పొందుపరచలేదు.
చెరువు అభివృద్ధికి
రూ.21.62 కోట్ల నిధులు
కాల్వలకు కాంక్రీట్ లైనింగ్..
రాతి పిచింగ్, డ్రెయిన్లు
స్పిల్‌వే, స్లూయిస్, గ్యాలరీ,
కట్ట పటిష్టత పనులు
75 రకాల పనులకు ప్రతిపాదనలు.. రూ.21.62 కోట్ల అంచనా


