ఇనుగుర్తి: పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని, ప్రతీ ఒక్కరు చెత్త నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ సూచించారు.మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మంగళవారం ఘన వ్యర్థాల నిర్వహణపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ అధికారి రేవంత్ పాల్గొని పరిసరాల పరిశుభ్రత, చెత్తను వేరు చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పార్థసారథి, సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, పంచా యతీ కార్యదర్శి విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ ఆశ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యూపీఐ చార్జీల విధానంతో సామాన్యులపై భారం
తొర్రూరు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ చార్జీల విధానంతో పరోక్షంగా సామాన్యులపై భారం పడుతుందని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ మేరకు డివిజన్ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో మాస్‌లైన్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు నిరసన తెలిపారు. రవి మాట్లాడుతూ.. వినియోగదారుడిపై చార్జీ లేకుండా వ్యాపారులపై చార్జీ పడుతుందనే కేంద్రం వాదన పసలేనిదని తెలిపారు. అమెరికా ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి నగదు లావాదేవీలను తగ్గించాలని ప్రచారం చేసి యూపీఐ చెల్లింపులను అలవాటు చేసిందన్నారు. తీరా ఇప్పుడు చార్జీల పేరిట సామాన్యులపై భారం మోపుతుందన్నారు.నాయకులు ముంజంపల్లి వీరన్న, ఊడుగుల రాములు, జక్కుల యాకయ్య, ఇరుగు అనిల్, కేశవులు, బిక్షం పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను అవుట్‌సోర్సి ంగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆహాన్ ఏజెన్సీ ఇన్‌చార్జ్ నాగార్జున మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డోర్నకల్ బాలికల పాఠశాల, మహబూబాబాద్ బాలుర పాఠశాల, తొర్రూరు బాలికల జూనియర్ కళాశాలల్లో పీజీటీ మ్యాథ్స్, వార్డెన్, డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు నెహ్రూసెంటర్‌లోని ఆహాన్ ఏజెన్సీలో విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదయం 11నుంచి సాయత్రం 4గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 8341712432, 9550473494 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
కేసముద్రం: బైక్ అదుపు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని పెనుగొండ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై క్రాంతికిరణ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం రజాలిపేటకు చెందిన అరిగెల శ్రీను(48) బైక్‌పై కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కేసముద్రం మండలం పెనుగొండ గ్రామం మీదుగా గూడూరు మండలం లక్ష్మీపురం వైపునకు వెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు క్షతగాత్రుడిని మానుకోట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నా రు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
గణపతి లడ్డూ రూ.3.55లక్షలు
కేసముద్రం: కేసముద్రం పట్టణ కేంద్రంలోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆదిదేవా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుడి మండపం వద్ద మంగళవారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. కేసముద్రంస్టేషన్‌కి చెందిన మంచన శంకర్‌రావు రూ.3,55,111కు వేలం పాడి లడ్డూను దక్కించుకున్నాడు. జిల్లాలోనే రికార్డు స్థాయిలో లడ్డూకు ధర పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.


