మహబూబాబాద్: జిల్లాలో 231 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి గత నెల 25నుంచి ఈనెల 3వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించారు. అలాగే, ఈనెల 7 నుంచి 19వ తేదీ వరకు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేశారు. కాగా, పోస్టుల కోసం అభ్యర్థులు తమ కుటుంబ సభ్యుల ద్వారా రాజకీయ నాయకులతో పైరవీలు చేస్తున్నారు. అయితే పూర్తిగా ఆన్‌లైన్‌తో పాటు ఇంటర్వ్యూల ద్వారా పోస్టులు భర్తీ చేయనుండడంతో నాయకులు, ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కాగా, మెరిట్ ఉండి కొంత అనుకూలంగా ఉండే వారికై నా పోస్టులు ఇప్పించాలని నాయకులు జోరుగా పైరవీలు చేస్తున్నారు.
1,437 కేంద్రాలు..
జిల్లాలో 1,437 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. కాగా, 1,309మంది టీచర్లు, 957మంది ఆయాలు, 49మంది సూపర్ వైజర్లు పని చేస్తున్నారు. టీచర్లు లేని సెంటర్లను ఇన్‌చార్జ్‌లతో నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి జిల్లాలో 231 పోస్టుల భర్తీకి గత నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దానిలో 101టీచర్ పోస్టులు, 130 ఆయా పోస్టులు ఉన్నాయి.
గత నెల 25నుంచి ఈనెల 3వరకు స్వీకరణ..
గత నెల 25నుంచి ఈనెల 3వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 101 టీచర్ పోస్టులకు 2,221 దరఖాస్తులు, 131ఆయా పోస్టులకు 919 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
ముగిసిన వెరిఫికేషన్..
ఈనెల 7నుంచి 19వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. దాని ప్రకారం టీచర్ పోస్టుల కోసం 1623 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ చేసుకోగా 598 మంది హాజరుకాలేదు. ఆయా పోస్టులకు 747 మంది మాత్రమే వెరిఫికేషన్ చేసుకోగా, 172 మంది హాజరులేదు.
స్థానికత తప్పనిసరి..
అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో స్థానికత ప్రధానం. కానీ, కొందరు స్థానికేతరులు కూడా దరఖాస్తు చేస్తున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రతీ ఒక్కరికి ఫోన్ చేస్తున్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం వెరిఫికేషన్ జాబితా సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసి జాబితా తయారు చేసి జీపీ కార్యాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆతర్వాత మరో జాబితా తయారు చేసి ఆన్‌లైన్ చేస్తారు.
ఇంటర్వ్యూల ద్వారానే..
ఇంటర్వ్యూలో కమిటీ చైర్‌పర్సన్‌గా కలెక్టర్, మెంబర్లుగా డీఎంహెచ్‌ఓ, ఆర్డీఓ కన్వీనర్‌గా డీడబ్ల్యూఓ వ్యవహరిస్తారు. ఇంటర్ మెరిట్‌కు 70శాతం మార్కులు, వితంతువుకు 5శాతం, అనాథకు 10 శాతం, దివ్యాంగులైతే 5 మార్కులు వేస్తారు. అలాగే ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ కావడంతో అభ్యర్థుల వివరాలన్నీ బహిర్గతంగానే ఉంటాయి. ఆవిషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. కాగా, అధికార పార్టీ నాయకుల చుట్టూ కొంత మంది అభ్యర్థులు తిరుగుతున్నారు. రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కానీ, ఆన్‌లైన్, ఇంటర్వ్యూ పద్ధతిన పోస్టుల భర్తీ చేయనుండడంతో పైరవీ అంతా సులువుగా కనిపించడం లేదు. కలెక్టర్ చైర్‌పర్సన్ కావడంతో ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నాయకులు మాత్రం వారి అభ్యర్థులకు పోస్టులు ఇప్పించేందుకు ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారు.
ముగిసిన అంగన్‌వాడీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
పకడ్బందీగా కొనసాగుతున్న ప్రక్రియ
పారదర్శకంగా భర్తీ చేసేందుకు అధికారుల కసరత్తు


