డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరింపులు

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

మహబూబాబాద్‌ రూరల్‌: పోలీసులుగా నటిస్తూ బంగారం వ్యాపారులను ఫోన్‌ ద్వారా బెదిరించి, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ నిందితుల వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన షేక్‌ఇర్ఫాన్‌, చింతలచెరువు ప్రశాంత్‌, చింతలచెరువు రవి, షేక్‌వాజిద్‌, చింతలచెరువు అక్షిత్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు.

పోలీస్‌ అధికారిగా నటిస్తూ షేక్‌ఇర్ఫాన్‌ ఫోన్‌

షేక్‌ఇర్ఫాన్‌ పోలీస్‌ యూనిఫాం ధరించి ఫొటో తీసుకుని, దానిని వాట్సాప్‌, ట్రూకాలర్‌ డీపీగా ఉపయోగించాడు. అనంతరం జిలాలోని కేసముద్రం మండలానికి చెందిన బంగారం వ్యాపారి బోగోజు వేణుగోపాలచారి ఫోన్‌ నంబర్‌ను గూగుల్‌లో సేకరించి ఈ నెల 10న అతడికి ఫోన్‌ చేశాడు. తాను వికారాబాద్‌ సమీపంలోని పార్వతీపురం పోలీస్‌ స్టేషన్‌ ఎస్సైని, ఇద్దరు దొంగలను పట్టుకున్నామని తెలిపాడు. వారు దొంగిలించిన బంగారాన్ని నువ్వు కొనుగోలు చేశావు, అందుకు సంబంధించిన రశీదులు తన వద్ద ఉన్నాయని చెప్పి అతడిని బెదిరించాడు. కొనుగోలు చేసిన బంగారాన్ని రికవరీగా ఇవ్వకపోతే అరెస్ట్‌ చేస్తానని భయపెట్టాడు. అనంతరం డబ్బులు పంపించాలని వాట్సాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ పంపించాడు. ఇలా వేణుగోపాలచారి నుంచి షేక్‌ఇర్ఫాన్‌ రూ.88,026 వసూలు చేశాడు.

సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు..

బాధితుడు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయగా కేసముద్రం ఎస్సై కె.క్రాంతికిరణ్‌ కేసు నమోదు చేశారు. కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో ఆదివారం సాయంత్రం కేసముద్రంలో షేక్‌ ఇర్ఫాన్‌, చింతలచెరువు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. కాగా, నిందితులు గత ఆగస్టు 15 నుంచి ఈ నెల 15 వరకు సుమారు రూ.4.20 లక్షలు వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు

నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. నల్లగొండ–1 టౌన్‌, ఆదిలాబాద్‌–1 టౌన్‌, ఇచ్చోడ, కట్టంగూర్‌, తిరుమలగిరి, రామగూడెం, బిక్కవోలు పోలీస్‌ స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇర్ఫాన్‌పై 8 కేసులు, ప్రశాంత్‌పై 6 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో అరెస్టయి జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీస్‌ యూనిఫాం, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం

నిందితుల నుంచి మొబైల్‌ ఫోన్‌, పోలీస్‌ యూనిఫాంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.3 లక్షల నగదు నిల్వ ఉన్న పలు బ్యాంకుల ఖాతాలను సీజ్‌ చేశారు. సమావేశంలో డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు, కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ, ఎస్సై కె.క్రాంతికిరణ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బంగారం వ్యాపారుల వద్ద రూ.4.20 లక్షల వసూళ్లు

నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఎస్పీ శబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement