సర్దుబాటు గోల! | - | Sakshi
Sakshi News home page

సర్దుబాటు గోల!

Sep 8 2026 1:41 AM | Updated on Sep 8 2026 1:41 AM

విద్యాశాఖ ఆదేశాలు ధిక్కరిస్తున్న పలువురు టీచర్లు

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితో పాటు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభమై మూడు నెలలు దాటినా చాలా పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టుల పాఠాలు ప్రారంభం కాలేదు. ఈ విద్యాసంవత్సరంలో పలువురు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందగా, పలువురు వేసవి సెలవుల కంటే ముందే రిటైర్డ్‌ కావడంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే సర్దుబాటు (వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌) కోసం జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఉత్తర్వులను పలువురు ఉపాధ్యాయులు ధిక్కరిస్తున్నారు. కేటాయించిన పాఠశాలలకు వెళ్లడం లేదు. దీంతో పలు పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక పాఠాలు సాగడం లేదు.

సర్దుబాటు ఇలా..

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పీడీ కేటగిరిలో సర్దుబాటు ప్రక్రియ నిర్వహిస్తారు. విద్యార్థుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులు అధికంగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు అవసరమైన పాఠశాలలకు కేటాయిస్తారు. ఈ ప్రక్రియలో తొలుత అదే మండలం పరిధిలోని పాఠశాలలకు కేటాయిస్తారు. సాధ్యం కానప్పుడు పక్కన ఉన్న మండలాలకు సర్దుబాటు చేస్తారు. ఇలా జిల్లాలో 77 మంది సెకండరీ స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), 31 మంది స్కూల్‌ అసిస్టెంట్లను జిల్లాలోని వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేశారు.

సంఘాల నాయకుల మద్దతు..

జిల్లాలో సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. వారి అండతో సర్దుబాటు చేసిన పాఠశాలలకు వెళ్లడం లేదని తెలిసింది. ఈక్రమంలో సదరు ఉపాధ్యాయులపై విద్యాశాఖ చర్యలు తీసుకునే క్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుపడుతున్నట్లు సమాచారం. కాగా, విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్న ఉపాధ్యాయులకు సంఘాల నాయకులు వత్తాసు పలకడం ఏమిటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వివిధ పాఠశాలలకు సర్దుబాటుపై వెళ్లని ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ప్రతీనెల ట్రీట్‌ ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుల సర్దుబాటు అంశంపై విద్యాశాఖ అధికారులను వివరణ కోరగా స్పందన లేదు. ఇప్పటికై నా కలెక్టర్‌ చొరవ తీసుకొని ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేసి ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో ఉపాధ్యాయుల వివరాలు..

132 పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులు మంజూరు ఉండగా.. 120మంది పనిచేస్తున్నారు. 12పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

1210 ఎస్‌ఏ పోస్టులు మంజూరు ఉండగా.. 1,145 మంది పనిచేస్తున్నారు. 65 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

92 జీపీహెచ్‌ఎం పోస్టులు మంజూరు ఉండగా.. 76మంది పనిచేస్తున్నారు. 16పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

30భాషా పండిట్‌ పోస్టులు మంజూరు ఉండగా.. 27మంది పని చేస్తున్నారు. 3పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

10 పీఈటీ పోస్టులకు 9మంది పనిచేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది.

2,000 ఎస్జీటీ పోస్టులకు 1,650 మంది పనిచేస్తున్నారు. 350 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌పై కేటాయించిన పాఠశాలలకు వెళ్లని ఉపాధ్యాయులు

సబ్జెక్టు టీచర్లు లేక కుంటుపడుతున్న బోధన

జిల్లాలో వెక్కిరిస్తున్న ఖాళీలు

అవసరమున్న చోట నియమించాలి..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలకు తప్పనిసరిగా వెళ్లి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్ప డాలి. విద్యార్థులు ఎక్కువగా ఉండి అవసరమున్న చోట సబ్జెక్టు టీచర్లను నియమించాలి.

– సంకా బద్రినారాయణ. పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement