విద్యారణ్యపురి: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటుచేసి విద్యనందించనుంది. నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కొంతకాలం క్రితమే అనుమతినిచ్చింది. తొలుతగా కొన్నింటికి పరిపాలనా అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 పబ్లిక్‌స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. ఈ నిధులతో ఆయా స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయి. ఇవి సెమీరెసిడెన్షియల్ స్కూళ్లుగా కొనసాగనున్నాయి. ఇక్కడ ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందించనున్నారు.
జిల్లా వారీగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు పాఠశాల ఎంపిక.. నిధుల కేటాయింపు..
● హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ 9.90కోట్లు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి హసన్‌పర్తిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌కు రూ 6.80కోట్లు మంజూరు చేశారు.
● వరంగల్ జిల్లాకు సంబంధించి తూర్పు నియోజకవర్గ పరిధి ఖిలా వరంగల్ మండలం శంభునిపేట ప్రభుత్వ హైస్కూల్‌కు రూ 8.30కోట్లు, నర్సంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.9.99కోట్లు.
● జనగామ జిల్లా నర్మెట మోడల్ స్కూల్‌కు రూ. 10.70కోట్లు.
● మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు ప్రభుత్వ హైస్కూల్‌కు రూ.7.50కోట్లు, డోర్నకల్ నియోజకవర్గ పరిధి నర్సింహులపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌కు రూ .11.20కోట్లు.
● ములుగు జిల్లా బండారుపల్లిలోని టీజీఎంఎస్‌కు రూ.9.20కోట్లు.
● జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె జెడ్పీహెచ్‌ఎస్‌కు రూ.11.50కోట్ల నిధులు మంజూరు చేశారు.
వసతులు, మెరుగైన విద్య
● రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఒక మోడల్‌గా నిర్మించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆ స్కూల్‌ను ప్రారంభించి ఆయన ఆదేశం మేరకు ఆ తరువాత వివిధ జిల్లాలనుంచి ప్రతిపాదనలు తీసుకుని పరిపాలనపరమైన అనుమతులు, నిధులు మంజూరు చేశారు.
● ప్రస్తుతం ఉన్న స్కూళ్ల భవనాలు, తరగతి గదులు ఉంచి అదనంగా గదులు, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్, క్రీడామైదానం, లైబ్రరీ, మోడల్ కిచెన్, డైనింగ్‌హాల్, డ్యాన్స్ హాల్ నిర్మిస్తారు.
● ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది.
● సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న హైస్కూళ్లనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఎంపిక చేశారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఎంపిక
ప్రతిపాదిత ప్రభుత్వ, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లలోనే ఏర్పాటు
ప్రీ ప్రైమరీనుంచి ఇంటర్మీడియట్ వరకు సెమీ రెసిడెన్షియల్‌గా విద్యతోపాటు క్రీడలు


