ఖానాపురం : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుపై ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. ఇటీవల నర్సంపేటలో గద్దె, విగ్రహాన్ని తొలగించడంతో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పార్టీ గ్రామ శ్రేణుల వివరాల ప్రకారం.. గ్రామ ప్రధాన రహదారి వెంట బీఆర్‌ఎస్ పార్టీకి రెండు గుంటల స్థలం ఉంది. ఇందులో కొంత స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించారు. మిగతా స్థలంలో మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని నాయకులు నిర్ణయించారు. దీనికి గతనెల 18న విగ్రహ ఏర్పాటు అనుమతికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక సర్పంచ్ అచ్యుతం విగ్రహ ఏర్పాటుకు అభ్యంతరం తెలపలేదు. జీపీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. రోడ్డు వెంట ఏర్పాటు చేసుకుంటే వెడల్పులో తొలగించాల్సి వస్తే సహకరించాలని సర్పంచ్.. బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. దీంతో ఈనెల 2న నిర్మాణ పనులు ప్రారంభించారు. 3వ తేదీన మధ్యాహ్నం పనులు చేపట్టారు. రాత్రి 10 గంటల వరకు గద్దె నిర్మాణ పనులు కొనసాగాయి. ఈ క్రమంలో అనుమతి లేకుండా గద్దె నిర్మాణం కొనసాగుతుందనే విషయం రాత్రి 11 గంటల సమయంలో ఎంపీడీఓ అద్వైత, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణితోపాటు కలెక్టర్ సత్యశారద దృష్టికి వెళ్లింది. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్.. వెంటనే గద్దెను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రాత్రి 11.30 ప్రాంతంలో ఎస్సై రామ్మోహన్, చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి సిబ్బందితో అశోక్‌నగర్‌కు చేరుకుని స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఉపేందర్‌రెడ్డి, నరేశ్, సురేశ్, వెంకన్నను అదుపులోకి తీసుకుని ఖానాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం జీపీ సిబ్బందితో కలిసి రాత్రి 2 గంటల సమయంలో గద్దెను తొలగించారు. ఈ సమయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో శివాలయం కూల్చివేసిన ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అశోక్‌నగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇదే విషయంపై జీపీ కార్యదర్శి జనార్దన్‌ను వివరణ కోరగా విగ్రహ ఏర్పాటుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, కలెక్టర్ నుంచి మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గద్దెను తొలగించినట్లు తెలిపారు.
ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఘటన
రెండో కూల్చివేతతో బీఆర్‌ఎస్
నాయకుల ఆగ్రహం


