● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
ములుగు : బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజాప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయలేని అభివృద్ధిని ప్రజా ప్రభుత్వం చేస్తుండడాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులపై కేటీఆర్ విమర్శలు చేసే ముందు తన పార్టీ నేతల రాజకీయ నేపథ్యాన్ని చూసుకోవాలని సూచించారు. దళిత ముఖ్యమంత్రి, ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలను గతంలో బీఆర్‌ఎస్ ఇచ్చి నెరవేర్చలేదని విమర్శించారు. రాజకీయాలు మానుకుని హుందాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి న నిధులు విడుదల చేయించడంలో బీజేపీ నాయకులు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు హుందాగా వ్యవహరించాలని, లేనిపక్షంలో ప్రజల చేతిలో మరోసారి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పల్లె జయపాల్ రెడ్డి, ముసినపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రూ.5.37 లక్షల విలువైన గంజాయి పట్టివేత
● ఇద్దరు యువకుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ శివారు కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వద్ద రూ.5, 37, 500 విలువైన గంజాయి పట్టుకుని ఇద్దరి యువకులను అరెస్ట్ చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ ఎస్.శ్రీనివాస్, ఎస్సై పిట్ట రాజేశ్ తెలిపారు. వారి వివరాల ప్రకారం.. బైక్‌పై హనుమకొండ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో బైక్‌పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగులో 10 కిలోల 750 గ్రాముల ఎండు గంజాయి లభించింది. దీంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఒడిశాకు చెందిన మనోజ్‌మడి, మడకం ముకేశ్ తమ స్నేహితుడు జోగ భీమ మడకాని వద్ద గంజాయి తీసుకుని వెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయితో పాటు బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.


