నల్లబెల్లి: బంధువు వివాహ వేడుకకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలిక విద్యుదాఘాతంతో మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మోడెం సాయి ప్రసన్నకుమార్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పిట్టల రమేశ్, రజిత దంపతుల చిన్న కూతురు సిరివెన్నెల (14) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి బంధువు వివాహ వేడుకకు హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో త్వరగా స్నానం చేయాలని తల్లిదండ్రులు సూచించగా వెళ్లిన సిరివెన్నెల కరెంట్ మోటార్ స్విచ్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై కిందపడిపోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పెళ్లిలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాల్సిన ఆ ఇంట తీరని శోకం నిండింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై సాయి ప్రన్న కుమార్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్‌షాక్ తగిలి బాలిక మృతి
● నల్లబెల్లిలో ఘటన


