సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని జీవించే రైతు.. అతివృష్టి, అనావృష్టి.. ప్రకృతికి కోపం వచ్చినా.. పంటలను చీడపీడలు నాశనం చేసినా.. లాభం వచ్చినా.. నష్టం వచ్చినా.. సాగు చేయడం మాత్రం మరువడు రైతు. అయితే కష్ట, నష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే.. సతికిల పడుతాడు.. మళ్లీ లేచేందుకు అప్పులైనా చేస్తారు.. అయితే పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తే మాత్రం రైతు రెట్టింపు ఉత్సాహంతో మరుసటి సంవత్సరం సాగుకు సన్నద్ధం అవుతారు. గిట్టుబాటు ధర అనేది పంటల ఎగుమతి మీద ఆధారపడి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యం గల ఎగుమతి కేంద్రంగా మానుకోట జిల్లాను ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మిర్చి, పసుపు, మామిడి పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశ రైతుల్లో చిగురించింది.
తేజ మిర్చికి డిమాండ్..
ఇక్కడ సాగుచేసే తేజ మిర్చికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కాస్త హెచ్చుతగ్గులతో జిల్లాలో ప్రతీ ఏటా 70వేల ఎకరాల మేరకు మిర్చి పంట సాగు చేస్తారు. దీనిని చూసిన పలు కంపెనీలు జిల్లాలోని సీరోలు మండలం కాంపెల్లి, మరిపెడ మండలం, డోర్నకల్ మండలం తోడెళ్లగూడెం ప్రాంతాల్లో మిర్చి నుంచి రసాయనాలు తీసే పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇక్కడ తీసిన మిర్చి రసాయనాన్ని ఆఫ్రికా, యూరప్, చైనా దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే దళారుల మోసం, మార్కెట్‌లో మిర్చి క్వింటాకు రూ.25వేల మేరకు పలుకగా.. మార్కెట్‌లో మోసం, దళారుల ఇష్టారాజ్యంతో రూ.5వేలకు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ఎగుమతి చేసే అవకాశాన్ని కల్పించడంతో రైతు పండించిన పంటకు కనీస మద్ధతు ధర వచ్చే అవకాశం ఉంటుంది.
పసుపునకు పూర్వవైభవం
పసుపు పంట అంటే బంగారం పండించినట్లే అని భావించిన జిల్లా రైతులు గతంలో విరివిరిగా సాగుచేసేవారు. కానీ బోర్డు లేకపోవడం, ఇతర దేశాలకు ఎగుమతులు సన్నగిల్లడం వంటి ప్రభావంతో ధరతో పాటు సాగు పడిపోయింది. గతేడాది నుంచి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.16వేల వరకు ధర పలకడంతో ఈఏడాది సాగుకు రైతులు మొగ్గుచూపారు. ఎగుమతులు పెరిగితే కనీస మద్ధతు ధర క్వింటాకు రూ.20 వేలకు పైగా ఉండే అవకాశం ఉంది.
మామిడికి జిల్లా ప్రత్యేకత
సాధారణ మామిడి పండ్లకన్నా.. పిందె దశలోనే కవర్లు తొడిగి పండించిన మామిడి పండ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. మానుకోట జిల్లాలో కవర్లు తొడిగి పండించిన మామిడి పండ్లు అమెరికా, జర్మనీ తదితర దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలోని 15వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున ఎగుమతులు పెంచితే మంచి ధర వస్తుంది. దీని ఆధారంగా మామిడి సాగు మరింత పెరగనుంది.
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
మిర్చి, పసుపు, మామిడి పంటలకు పెరగనున్న డిమాండ్


