ఇనుగుర్తి: రైతులు, నిరుపేదలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి నాణ్యమైన సన్నబియ్యం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలకేంద్రంలోని రైతువేదికలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, దిశా కమి టీ సభ్యులు గుజ్జునూరి బాబురావు, మార్కెట్ డైరెక్టర్ కొట్టం రాము, పీఏసీఎస్ డైరెక్టర్ కొట్టం మహేందర్ పాల్గొన్నారు. ఇనుగుర్తి కొత్త మండలంగా ఏర్పడినప్పటికీ తాజాగా అందజేసిన స్మార్ట్‌రేషన్ కార్డులపై ఇంకా కేసముద్రం, నెల్లికుదురు మండలాల పేర్లు ఉండడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నేడు గురు పూజోత్సవం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐడీఓసీలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు గురుపూజోత్సవం వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా ఏసీజీఈ మందుల శ్రీరాములు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్రునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్, తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
అన్ని పంటలకు మద్దతు ధర చట్టం చేయాలి
కొత్తగూడ: రైతులు పండించే అన్ని రకాల పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిబిస్తున్న రైతు వ్యతిరేఖ విధానాలపై ఉద్యమిస్తామన్నా రు. ఈనెల 8, 9 తేదీల్లో మంచిర్యాలలో జరిగే ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీలో శ్రీశైలం, బూర్క వెంకటయ్య, పుల్లన్న, పూర్ణచందర్, జామ్లా, రాజు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం దేవస్థానం నిర్మాణాల వేగిరం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్ధరణలో భాగంగా విజయగణపతి ఆలయం నైరుతి మూలన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.198కోట్లతో ఆలయ నిర్మాణాలు చేపట్టారు. శుక్రవారం స్టోన్‌తో బేస్‌మెంట్ 12ఫీట్ల నుంచి నిర్మాణం చేపట్టారు. వెనుకాల ప్రాకారం నిర్మిస్తున్నారు. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.


