కలెక్టర్ స్నేహ శబరీష్
నర్సింహులపేట: జిల్లాలో 22/ఏ నిషేధిత జాబితాలోని వ్యవసాయేతర భూములను సక్రమంగా గుర్తించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి భూ రికార్డులను తనిఖీ చేశారు. భూ రికార్డుల్లో ఎక్కడైనా వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సబ్‌స్టేషన్లు తదితరాలు ఉంటే త్వరితగతిన గుర్తించాలని ఆదేశించారు. నర్సింహులపేట, వంతడపల, కొమ్ములవంచ, పెద్దనాగారం, కౌసల్యదేవిపల్లి, బొజ్జన్నపేట గ్రామాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్‌బాబు, డీటీ, జీపీఓలు పాషా, తుమ్మ రాధిక తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ గడువు పెంపు
మహబూబాబాద్ అర్బన్: జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) దరఖాస్తుల గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు డీఈఓ సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులతో నూతనంగా, అలాగే దరఖాస్తు రెన్యూవల్ చేసుకోవాలని తెలపాలని ఆయన సూచించారు.
రోడ్డు ప్రమాద కేసులు పరిష్కరించాలి
మహబూబాబాద్ రూరల్: లోక్ అదాలత్‌లో రోడ్డు ప్రమాద కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించాలని జిల్లా జడ్జి మురళీమోహన్ అన్నారు. ఈ నెల 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ సన్నాహక చర్యల్లో భాగంగా జిల్లా జడ్జి మంగళవారం బీమా కంపెనీ న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆయా కంపెనీల పెండింగ్ కేసుల వివరాలు, లోక్ అదాలత్ పరిష్కార ప్రక్రియలపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదంలో వైకల్యం పొందినవారు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారు నష్టపరిహారం కోసం ఆత్రుతతో ఎదురుచూస్తుంటారని, వారికి సత్వర న్యాయం కల్పించడమే ధ్యేయంగా బీమా కంపెనీలు ముందుకు వచ్చి కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలన్నారు. బీమా కంపెనీలు తాము ఏయే కేసులలో రాజీకి సిద్ధమో ఆ కేసుల జాబితా వెంటనే సమర్పించాలని కోరారు. ఈ నెల 7, 8వ తేదీల్లో రోడ్డు ప్రమాద కేసుల పరిష్కాల నిమిత్తం ప్రీ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతిమురారి, న్యాయవాదులు పద్మాకర్ రెడ్డి, శ్రీనివాస్, శృతి తదితరులు పాల్గొన్నారు.
రెండు రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీ
కేసముద్రం: మున్సిపాలిటీ కేంద్రంలోని లక్ష్మీపురుషోత్తం, నీలకంఠ రైస్ మిల్లుల్లో స్టేట్ సివిల్ సప్లయీస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2022–23 సంవత్సరానికి సంబంధించిన టెండర్ ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్‌ఓ రమేశ్ తెలిపారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించిన అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
పూర్తిస్థాయిలో నిండిన బయ్యారం పెద్దచెరువు
బయ్యారం: రెండుగుట్టల నడుమ కాకతీయులకాలంలో నిర్మించిన బయ్యారం పెద్దచెరువు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. రాష్ట్రంలో ఏటా వానాకాలంలో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ముందుగా మత్తడి దూకే బయ్యారం పెద్దచెరువు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యంగా మత్తడి దశకు చేరింది. 16.2 అడుగుల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం గల బయ్యారం పెద్దచెరువులోకి మంగళవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీరు చేరింది. దీంతో స్వల్పస్థాయిలో మత్తడి నుంచి నీరు బయటకు వస్తోంది.


