ఆత్మకూరు: అదనపు కట్నం వేధింపులు తాళలేక మనస్తాపంతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. సీఐ సంతోశ్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన అఖిల(24)కు గూడెప్పాడ్ గ్రామానికి చెందిన చల్లా ప్రవీణ్‌రెడ్డితో 2022లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు అధిక్‌రెడ్డి ఉన్నాడు. వివాహమైన కొంత కాలం నుంచి ప్రవీణ్‌రెడ్డి అదనపు కట్నం రూ.50 వేలు కావాలంటూ అఖిలను వేధించసాగాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి అదనపు కట్నం కోసం మరో సారి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో వేధింపులు భరించలేక అఖిల మంగళవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న సీఐ సంతోశ్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు. తహసీల్దార్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంజీఎంలో పంచనామా నిర్వహించారు. మృతురాలి సోదరుడు బుర్ర చందర్ ఫిర్యాదు మేరకు పరకాల ఏసీపీ సతీశ్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్ తెలిపారు.
గూడెప్పాడ్‌లో ఘటన
వివరాలు వెల్లడించిన పోలీసులు


