వర్షపు చుక్కను ఒడిసి పట్టిన మహిళా రైతు భాగ్యమ్మ
పాలకుర్తి టౌన్ : వర్షం పడితే నీరు పొలంలో నిలవడం.. ఎండలు మొదలైతే అదే నీటి కోసం ఎదురు చూడడం.. నీటి కొరతతో పంటలు కాపాడుకునేందుకు ఆ మహిళా రైతు గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కోసం వర్షపు ప్రతీ చుక్కను ఒడిసిపట్టాలని ఆలోచించారు. అనుకున్నదే తడువుగా తన వ్యవసాయ భూమిలో ఫాంపాండ్ నిర్మించుకున్నారు. ఫలితంగా వర్షాకాలంలో నీటిని కుంటలో నిల్వ చేసుకుని అవకాశం ఏర్పడింది. దీంతో ముఖ్యంగా ఎండాకాలంలో సాగు నీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కొంతవరకు తగ్గింది. అంతేకాకుండా నీటి నిల్వ కోసం ఆ ప్రయత్నం ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు దండిగ భాగ్యమ్మ.
‘మారి’ స్వచ్ఛంద సంస్థ సహకారం..
భాగ్యమ్మ ప్రయత్నానికి ‘మారి’ స్వచ్ఛద సంస్థ అండగా నిలిచింది. ఆ సంస్థ అమలు చేస్తున్న ‘బెటర్ కాటన్ ప్రాజెక్టు’లో భాగంగా ఫాంపాండ్ నిర్మాణానికి రూ.20 వేల ఆర్థిక సాయం చేయడంతో భాగ్యమ్మ తను పొలంలో నీటి కుంట(ఫాంపాండ్)ను నిర్మించుకున్నారు. ఫలితంగా వర్షపు నీటిని కుంటలో నిల్వ చేసుకుని అవకాశం కలిగింది.
రైతులకు వరం.. ఫాంపాండ్ నిర్మాణాలు
మార్బన్ ఆర్కిటెక్టస్ ఫర్ రూరల్ ఇండియా (మారి) స్వచ్ఛంద సంస్థ ‘బెటర్ కాటన్ ప్రాజెక్టు’ ద్వారా జనగామ జిల్లాలో 20 ఫాంపాండ్ (నీటి గుంతల) నిర్మాణాలు రైతులకు వరంగా మారాయి. పాలకుర్తి , జఫర్‌గఢ్, చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పలు మండలాల్లో రైతులు ఫాంపాండ్ నిర్మాణాలను విరివిగా చేపడుతున్నారు. ఇవి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్నాయి. తగినంత వర్షపాతం ఉన్నప్పటికీ కరువు ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు ఫాంపాండ్‌లు దోహదపడున్నాయి. వేసవితాపంతో అడుగంటిన భూగర్భజలాలతో కొట్టుమిటాడుతున్న రైతులకు వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పెంపునకు దోహదపడుతూ ఆసరాగా నిలుస్తున్నాయి. తీవ్ర కరువు పరిస్థితుల్లో వేసుకున్న పంటలకు నీరందించడంతో పాటు పశువుల దాహార్తిని తీర్చుతున్నాయి. రైతుల కష్టాలను గట్టెక్కించే నీటిగుంతల నిర్మాణాలకు ‘బెటర్ కాటన్ ప్రాజెక్టు’ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
ఫాంపాండ్ నిర్మాణంతో నీరు నిల్వ
ఫలితంగా వేసవిలో సాగుకు తప్పిన ఇబ్బందులు


