కేయూ, వేదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ మధ్య ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

కేయూ, వేదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ మధ్య ఎంఓయూ

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ హైదరాబాద్‌కు చెందిన వేదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ, ప్రజ్ఞ సెమీ కండక్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అటల్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, వేదా ఐఐటీ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ కె సుబ్బరంగయ్యతో పాటు సంబంధిత సంస్థల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్‌ రామచంద్రం మంగళవారం యూనివర్సిటీలో వెల్లడించారు.

ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ప్రయోజనం..

ఈ అవగాహన ఒప్పందంతో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. పరిశ్రమల అవసరాలకనుగుణంగా ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌, విద్యార్థుల్లో పరిశ్రమలకనుగుణంగా అవసరమై న నైపుణ్యాలు పెంపొందించనున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా పీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారని వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. కేయూలోని కోఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, క్యాంపస్‌లోని యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల, వరంగల్‌ కిట్స్‌ విద్యార్థులు అర్హులుగా ఉంటారు. బీటెక్‌, బీటెక్‌ హానర్స్‌ విద్యార్థులకు నాలుగో సంవత్సరం 7, 8 సెమిస్టర్లు, ఎంటెక్‌ విద్యార్థులకు రెండో సంవత్సరం 3, 4వ సెమిస్టర్‌ విద్యార్థులకు శిక్షణలు ఇవ్వబోతున్నామని వారు తెలిపారు. ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ అనుబంధ విభాగాలకు చెందిన బ్యాక్‌లాగ్‌ లేని విద్యార్థుల కోసం కనీసం 7.5 సీజీపీఏ లేదా 70శాతం మార్కులు సాధించిన స్టూడెంట్లకు ఈ శిక్షణ ఇస్తారు. వేదా ఐఐటీ నిర్వహించబోయే రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఆయా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అవగాహన ఒప్పందం ఐదు సంవత్సరాల పాటు ఉంటుందని వీసీ, రిజిస్ట్రార్‌ తెలిపారు. కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రాంరెడ్డి, రూసా నోడల్‌ అధికారి ఆర్‌. మల్లికార్జున్‌రెడ్డి, వరంగల్‌ కిట్స్‌ ప్రిన్సిపాల్‌ కె. అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement