కోతుల భయంతో పట్టాలపైకి.. | - | Sakshi
Sakshi News home page

కోతుల భయంతో పట్టాలపైకి..

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

జనగామ: రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై కోతులు ఒక్కసారిగా దూసుకురావడంతో వృద్ధ దంపతులు భయపడి బ్రిడ్జి దిగి పట్టాల వైపు వెళ్లారు. అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌ కింది నుంచి పట్టాలు దాటే క్రమంలో రైలు కదలడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో కళ్లెదుటే భార్యను కోల్పోయిన భర్త గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన జనగామ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు, మృతురాలి కుమారుడి స్నేహితుడు కోయల్కర్‌ రాజేశ్‌ కథనం ప్రకారం.. జనగామలోని బాణాపూర్‌ మూడో ఫేజ్‌కు చెందిన గంగాసాని గురువారెడ్డి, ఊర్మిళ (76) దంపతులు గత నెల 31వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి వారి దర్శనం ముగించుకుని అదే రోజు రాత్రి జనగామకు చేరుకున్నారు. రాత్రి సమయం కావడంతో ఇంటికెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బస చేశారు. మంగళవారం ఉదయం ఇంటికెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం 2 నుంచి ప్లాట్‌ఫాం 1కు వెళ్లేందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఎక్కారు. అయితే బ్రిడ్జిపై గుంపులుగా ఉన్న కోతులు ఒక్కసారిగా వారిపైకి దూసుకురావడంతో వృద్ధ దంపతులు భయాందోళనకు గురయ్యారు. వాటి నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా బ్రిడ్జి దిగి కిందికొచ్చారు. మరో మార్గం లేకపోవడంతో రెండో ప్లాట్‌ఫాం వద్ద నిలిచి ఉన్న గూడ్స్‌ రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు యత్నించారు. గురువారెడ్డి ముందుగా పట్టాలు దాటగా, ఆ తర్వాత ఊర్మిళ ట్రాక్‌ దాటుతున్న సమయంలో రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో రైలు ఆమైపె నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె వెనుక ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో గురువారెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలికి కుమారుడు సంతోశ్‌ ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

కోతుల బెడదపై ప్రయాణికుల ఆగ్రహం..

జనగామ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో, ముఖ్యంగా ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రయాణికులపైకి దూసుకురావడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు బ్రిడ్జిపై వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు ప్రాణాలకు తెగించి రైల్వే పట్టాలు దాటాల్సి వస్తోంది. తాజా ఘటన నేపథ్యంలో రైల్వే, పురపాలక అధికారులు తక్షణమే స్పందించి స్టేషన్‌లో కోతుల బెడద అరికట్టి తమ భద్రతకు చర్యలు చేపట్టాలని పలువురు ప్రయాణికుల డిమాండ్‌ చేస్తున్నారు.

కదిలిన గూడ్స్‌ రైలు.. వృద్ధురాలి మృతి

కళ్లెదుటే భార్యను కోల్పోయిన భర్త

ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై కోతుల గుంపులతో భయం..భయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement