చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌, రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌, రిమాండ్‌

Sep 4 2026 7:47 AM | Updated on Sep 4 2026 7:47 AM

ములుగు : మండలంలోని అబ్బాపూర్‌ గ్రామంలో వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణా (పుస్తెలతాడు)న్ని ఎత్తుకెళ్లిన ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్‌, నిర్మల్‌ జిల్లాకు చెందిన పండుగ రమేశ్‌ , నిజామాబాద్‌ జిల్లా సారంగపూర్‌ గ్రామానికి చెందిన గుంజ గంగాధర్‌ కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అబ్బాపూర్‌లో వృద్ధ దంపతులు మాత్రమే నివసిస్తున్న ఇంటిని ప్రసాద్‌ కొద్దిరోజులు గమనించాడు. అనంతరం మిగతా ఇద్దరితో కలిసి చోరీకి పథకం వేశాడు. ఆగస్టు 19న గ్రామానికి వచ్చి రెక్కీ నిర్వహించారు. ఈక్రమంలో అదే రోజు అర్ధరాత్రి తర్వాత వృద్ధురాలు మూత్రవిసర్జనకు బయటకు వచ్చిన సమయంలో ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. అనంతరం గ్రామంలో పార్క్‌ చేసిన బైక్‌పై పరారయ్యారు. కొలనూరు రైల్వే స్టేషన్‌ వద్ద బైక్‌ పంక్చర్‌ కావడంతో అక్కడే వదిలి రైలులో మంచిర్యాల వెళ్లారు. తిరిగి చోరీలకు పాల్పడేందుకు ములుగు పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో మంగళవారం ఉదయం జీవింతరావుపల్లి వై జంక్షన్‌ వద్ద పోలీసులకు చిక్కారు. దీంతో వారి వద్ద నుంచి మొత్తం 4.280 తులాల బంగారం ఆభరణాలు, అబ్బాపూర్‌లో అపహరించిన బైక్‌, నిందితుల బైక్‌, రెక్కీకి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. కాగా, కేసు ఛేదనలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన ములుగు సీఐ సురేశ్‌, ఎస్సై ఎస్‌. వెంకటేష్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement