● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం, పెన్షన్, ఇతర ఫలాలను వెంటనే అందజేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్, సాంఘిక సంక్షేమశాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కేసులు పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. వసతిగృహాల్లో పక్కాగా డైట్ మెనూ పాటించాలని, గృహాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నోటీసులకు స్పందించాలి
ఎస్‌ఐఆర్(సర్)లో భాగంగా అధికారులు ఇచ్చిన నోటీసులకు ఓటర్లు తప్పనిసరిగా స్పందించి ఓటును పరిరక్షించుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హన్మంతునిగడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్, పద్మశాలి భవన్‌లోని పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న నోటీసుల ప్రక్రియను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 11రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి జతపర్చి బీఎల్‌ఓలకు అందజేయాలన్నారు. ఆర్డీఓ రాజేశ్వరి, మున్సిపల్ డీఈఈ ఉపేందర్, డీటీ నాగరాజు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో విఫలం
కురవి: ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రులు రెడ్యానాయక్, సత్యవతిరాథోడ్ విమర్శించారు. గురువారం బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లి పరిశీలించి, రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారా..?, వ్యవసాయానికి సాగునీరు సరిపోను అందుతుందా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి ర్యాలీగా గుడిసెంటర్ వద్దకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే పొద్దున లేస్తే సూర్యాపేటలోనే ఉంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు బాకీ కార్డులను అన్ని గ్రామాల్లో పంచాలని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు నెరవేర్చలేదని ప్రజలకు తెలిసేలా చెప్పాలని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు పిచ్చిరెడ్డి, రవినాయక్, లాలయ్య, నర్సింహారావు, రమేశ్, నాగయ్య, భరత్, విజయ్, శ్రీను, శోభన్, కృష్ణ, భాస్కర్, నెహ్రూ, నరహరి, సాంబశివరావు పాల్గొన్నారు.


