మహబూబాబాద్ రూరల్: హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడి, నల్లగొండ బీజేపీ ఆఫీస్‌పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడిని నిరసిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. అయి తే డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షణలో టౌన్ ఇన్‌చార్జ్ సీఐ అంజలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు మూడుకొట్ల సెంటర్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి వెళ్తుండగా పంచముఖ హనుమాన్ దేవాలయం సమీపంలో పోలీసులు రహదారిపై తమ వ్యాన్ అడ్డుపెట్టి రోప్ పార్టీ ద్వారా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. ఈక్రమంలో పోలీసులు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఓ వాహనంలో బలవంతంగా ఎక్కించారు. అయినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యే కార్యాలయం వైపు పరుగులు పెట్టారు. పోలీసుల వారిని అడ్డుకుని, అదుపులోకి తీసుకుని కురవి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


