న్యూస్‌రీల్
సాక్షి, మహబూబాబాద్:
మాతృ దేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అంటారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దేది మాత్రం గురువులే. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గురువులను పూజించుకునే అవకాశం ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న కలుగుతుంది. ఈ ప్రత్యేక రోజున గురువులను ప్రభుత్వం తరఫున సన్మానించడం ఆనవాయితీ. ఈమేరకు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక చేసేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
జిల్లా నుంచి 28 దరఖాస్తులు..
ఉత్తమ గురువుల ఎంపిక కోసం విద్యాశాఖ ప్రకటన విడుదల చేయగా.. జిల్లాలో 28 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 13 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 14 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఒకరు ప్యానల్ గ్రేడ్ హెడ్మాస్టర్ ఉన్నారు. అయితే గతంలో మండల విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేసుకుంటే అక్కడ ప్రాథమిక పరిశీలన పూర్తి చేసి తర్వాత జిల్లా కమిటీకి పంపించేవారు. ఈ ఏడాది మాత్రం దరఖాస్తుపై ఎంఈఓతో సంతకం పెట్టించి, నేరుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు. ఆగస్టు 29వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు.
తొమ్మిది అంశాలు.. 100 మార్కులు
ఉత్తమ గురువుల ఎంపికలో తొమ్మిది అంశాలు, 100 మార్కులు కేటాయించారు. దరఖాస్తుతో పాటు పెట్టిన వార్తా క్లిప్పింగ్స్, ఫొటోలు, రికార్డుల ఆధారంగా మార్కులు కేటాయించారు. ప్రధానంగా పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం, బడి బయట ఉన్న బడీడు పిల్లలను బడిలో చేర్పించి డ్రౌపౌట్ లేకుండా చూడడం, పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం, ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత, సాధించిన మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు జరిగిన సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థుల పాల్గొనడం, ఉత్తములుగా ఎంపిక కావడానికి సదరు ఉపాధ్యాయుడి తోడ్పాటు, పాఠశాలలోని పిల్లల ఆధార్ నమోదు, దాతలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల భాగస్వామ్యం, ప్రభు త్వ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చుకోవడం, విద్యార్థులకు సౌకర్యాలు మెరుగుపర్చడం, పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడం, పచ్చదనం, పరిశుభ్రత వంటి అంశాలకు పది మార్కులు చొప్పున 80 మార్కులు ఉంటాయి. బోధనోపకరణాలు, ఏఐ, ఇతర అందిపుచ్చుకున్న నూతన పరిజ్ఞానంతో బోధన, అనుకరణ మొదలైన వినూత్న బోధనకు 20 మార్కులు ఉంటాయి. ఇలా మొత్తంగా 100 మార్కులకు వచ్చిన మార్కులను లెక్కించి ఉత్తమ గురువులను ఎంపిక చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
గతంలో విమర్శలు..
ఉన్నతాధికారులు పేర్కొన్న పారామీటర్లు, ఉపాధ్యాయులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి తుది జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లాలోని ఐదుగురు పీజీ హెచ్‌ఎంలతో కమిటీ వేసి తుది జాబితాను తయారు చేశారు. అయితే గతంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తూ చక్రంతిప్పే పలువురు ఉద్యోగులు తమ అనుచరులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇప్పించే ప్రయత్నం చేశారు. పలుమార్లు అనర్హులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని గత ఏడాది 30 మంది జాబితా పంపించగా అందులో 10 మందిని మాత్రమే ఎంపిక చేశారు. ఇప్పుడు కూడా పంపించిన 28 మంది జాబితాలో ఎంత మందిని ఎంపిక చేస్తారో అనేది తేలాల్సి ఉంది. కాగా, కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్(లోకల్ బాడీ), జిల్లా విద్యాశాఖ అధికారి సభ్యులుగా ఉండి తుది జాబితా సిద్ధం చేయనున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు కసరత్తు తొమ్మిది అంశాలు.. 100 మార్కులు
ఐదుగురు సభ్యుల కమిటీతో దరఖాస్తుల పరిశీలన
జిల్లాలో 28 మంది
ఉపాధ్యాయుల దరఖాస్తు
కలెక్టర్ వద్దకు చేరిన తుది జాబితా


