● జిల్లా జడ్జి మురళీమోహన్
మహబూబాబాద్ రూరల్ : జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించాలని జిల్లా జడ్జి మురళీమోహన్ అన్నారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో బుధవారం సన్నాహక, సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులను రాజీమార్గం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 7, 8వ తేదీల్లో ప్రీ లోక్ అదాలత్ నిర్వహిస్తామని, రాజీకి సిద్ధమైన కేసుల వివరాలను న్యాయవాదులు 5వ తేదీలోపు న్యాయ సేవా సంస్థలో అందించాలని కోరారు. ఈ ప్రీ లోక్ అదాలత్ ద్వారా పిటీషనర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య సంప్రదింపులు జరిపి సత్వర పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు.


