మహబూబాబాద్ రూరల్ : విద్యార్థుల ఉజ్వల భవిష్యతే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ చీనానాయక్ అన్నారు. యూనివర్సిటీ పరిధి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మల్యాల ఉద్యాన కళాశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి అనుభవం, వ్యవసాయ, ఉద్యాన ఆచరణాత్మక పరిజ్ఞానం పెంపొందించేలా కళాశాలల్లో అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. కళాశాలలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఇటీవల పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి ఆదేశాల మేరకు కళాశాలను సందర్శించామని తెలిపారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యా బోధన, ఆహారం, సాగు పద్ధతులు తదితర అంశాలపై ఆరా తీశామని, తరగతి గదులు, వంటశాల, భోజనశాల, కూరగాయల సాగు ప్రాంతాలను పరిశీలించామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కళాశాలలో మరిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల అభ్యాసానికి పెద్దపీట వేస్తూ కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, లైబ్రరీ, హాస్టల్, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. మల్యాల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ ప్రీతంగౌడ్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
డీన్ చీనానాయక్


