సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్(సర్) ముసాయిదా ఓటరు జాబితాలో పలు తప్పులు దొర్లాయి. జిల్లాలో 80వేలకు పైగా ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్, పలు అంశాలు తప్పుగా నమోదు కావడంతో వాటిని సవరించేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈమేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో బీఎల్‌ఓలు సవరణ జాబితాలో ఉన్న పేర్లు చదువగా.. చిన్న చిన్న తప్పులు, ఫారాలు నింపే సందర్భంలో తప్పులుగా నమోదు కావడం, ఒకే ఇంటిపేరుతో ఉన్న పలువురు ఓటర్ల పిల్లలకు కూడా నోటీసులు రావడం, తండ్రి పేరు సరైనదే అనే ధ్రువీకరణ పత్రాలు చూపించేందుకు ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అయితే 12 రకాల గుర్తింపు కార్డుల ఆధారంగా జాబితాలో సవరణ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తప్పుల నమోదు ఇలా..
● డోర్నకల్ పట్టణంలోని 14 వార్డులో ఓటరు పేరు షేక్ షబియానా బేగంగా నమోదు కాగా.. ఇప్పుడు ఎండీ షబియానా బేగంగా నమోదు అయ్యింది. అయితే గతంలో షేక్ అని నమోదు చేయడం తప్పుగా భావించి కొత్త జాబితాలో ఎండీగా మార్చారు. అయితే ఇప్పుడు పేరు తప్పుగా ఉందని సవరణ జాబితాలో చేర్చి గ్రామ సభలో చదివి వినిపించారు. అయితే ఇతర ఆధారాలు చూపించడంతో ఓటరు సవరణ ప్రక్రియ చేశారు.
● మహబూబాబాద్ రూరల్ మండలంలోని లక్ష్మీపురం తండా గ్రామంలో 741 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 193 మంది ఓటర్లను సవరణ జాబితాలో చేర్చారు. ఇందులో తల్లిదండ్రుల పేర్లు, అత్తామామలు, ఇంటిపేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా వచ్చినట్లు పేర్కొంటూ సవరణ జాబితాలో చేర్చారు. అయితే ఎన్యూమరేషన్ ఫారం సమర్పణలో తొందర పాటు, భర్తీ చేయడంలో తప్పులు చేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. గ్రామ సభలో సవరణ జాబితాలో ఉన్న వారు స్టడీ సర్టిఫికెట్, ఇతర ఆధారాలు చూపించి సరిచేసుకోవాలని సూచించారు.
● నర్సింహులపేట మండలంలో ఆకుతోట ఇంటి పేరుతో ఉన్న ఓటర్లు, తండ్రి పేరు ఒకే విధంగా ఉండడంతో ఆ ఓట్లు సరైనవి కాదని సవరణ జాబితాలో చేర్చారు. నిజానికి ఒకే ఇంటిపేరు, ఒకే పేరుతో పలువురు ఓటర్లు ఉన్న విషయం వాస్తవమే. అయితే తండ్రి పేరు సరైనదే అని చూపించేందుకు అక్షరాస్యులు స్టడీ, ఇతర సర్టిఫికెట్లు చూపించగా.. నిరక్షరాస్యులు, వృద్ధులు తప్పులను సరిచేసుకునేందుకు సరైన ఆధారాలు లేక ఇబ్బందులు పడ్డారు.
1006 ఓటర్లలో 451 మందికి నోటీసులు
కురవి: సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలో సర్పంచ్ మల్లికంటి సురేష్ అధ్యక్షతన గురువారం సర్‌పై గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో 1081 ఓట్లు ఉండగా.. అందులో 75 ఓట్లు షిఫ్ట్, డెత్ ఉన్నాయి. మిగిలిన 1006 ఓట్లలో 451 మంది ఓటర్ల పేర్లు అన్‌మ్యాప్డ్, అనామలీస్ జాబితాలో ఉన్నాయి. 451మందికి నోటీసులు అందజేశారు. కాగా, 451 మంది ఓటర్లకు నోటీసులు రావడంతో ఓట్లు ఉంటాయా? పోతాయా? అనే అనుమానాలను సర్పంచ్ సురేష్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, బీఎల్‌ఓలు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఓ తోట మధు, వార్డు సభ్యుడు కన్నం రాంబాబు, కాంగ్రెస్ పార్టీ మూడు మండలాల సర్ ఇన్‌చార్జ్ గొల్లపల్లి రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
పేరు చివర కులం ఉండడంతో
నోటీసు ఇచ్చారు
గార్ల: ఓటరు జాబితాలో మొదటి నుంచి నా పేరు కోల కుమార్ అని ఉంది. అయితే 2002 ఓటరు జాబితాలో కులం పేరుతో కోల కుమార్‌గౌడ్ గా ఉన్నందున గ్రామసభలో బీఎల్‌ఓ నోటీసు ఇచ్చారు. జాబితాలో ఒకేపేరుతో ఓటరుగా నమోదు కావాలని నోటీస్ ఇచ్చారు. ఈమేరకు బీఎల్‌ఓకు కుల ధ్రువీకరణ, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్స్ కాపీలను ఇచ్చాను. ఓటుపోకుండా సరిచేస్తామని బీఎల్‌ఓ తెలిపారు.
– కోల కుమార్‌గౌడ్, గార్ల
ఒకే ఇంటిపేరు ఉన్న ఓటర్లను వేధిస్తున్న సమస్యలు
తల్లిదండ్రుల వయస్సు తేడాతో ఇబ్బంది
పేర్లు తప్పుగా పడడంతో సవరణ జాబితాలోకి..


