● కలెక్టర్ స్నేహ శబరీష్
డోర్నకల్: అక్టోబర్ 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. సీరోలు మండలం చిలుకొయ్యలపాడు గ్రామంలో గురువారం సర్ కార్యక్రమంపై జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక ఓటరు సవరణ ముసాయిదా జాబితాలో పేరును పరిశీలించుకోవడం, తప్పులను సరి చేసుకుని ఓటును నిర్ధారించుకునేందుకు నెలరోజుల గడువు ఉన్నట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ పత్రాలను బీఎల్వోలకు అందించి ఓటు హక్కును భద్రపర్చుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండినవారు ఫారం–6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేరు, చిరునామా, పుట్టినతేదీ, ఫొటో తప్పుగా ఉంటే ఫారం–8 ద్వారా సరిచేసుకోవాలని సూచించారు. తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు పారదర్శకంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్, సీరోలు తహసీల్దార్ పున్నంచందర్, సర్పంచ్ ఊడుగుల వెంకన్న, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తేజావత్ సుధాకర్, ఎంపీడీఓ గౌస్‌పాషా, పంచాయతీ సెక్రటరీ నాగయ్య పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలి
మహబూబాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహశబ రీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారులకు సాంకేతిక, నిధుల సమస్యలు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆదేశించారు. వీబీజీ రామ్ జీ పథకం అమలు తీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఉద్యాన శాఖల ద్వారా పొలం కుంటల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఏఓలు, ఏఈఓలు సబ్సిడీలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


