● తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ శ్రీనివాస్
మహబూబాబాద్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ వడ్డెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులు క్లియర్ చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్ విధివిధానాలు అమలు చేసి సత్వరమే సేవలు అందించాలన్నారు. ఐక్యంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఫీ, సంకా బద్రినారా యణ, కిషన్ నాయక్, సతీష్‌రెడ్డి, రమేష్, మురళీకృష్ణ, మల్లారెడ్డి, ఫిరోజ్, ప్రసాద్, భాస్కర్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


