● ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలే పీఆర్టీయూ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చూడుతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, ఆమరణ నిరాహార దీక్ష వంటి ప్రజాస్వామ్య పోరాట కార్యాక్రమాలకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ సాధనకు పోరాడాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలన్నారు. హెల్త్‌స్కీమ్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, నూతన పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ డీఏల బకాయిలు విడుదల చేయాలని, పారదర్శక పదోన్నతులు, బదిలీలు, ఏకీకృత సర్వీస్ రూల్స్, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, ఏఎఫ్‌ఐటీఓ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గీత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


