ఆ ‘ఉత్తమ’అధికారి.. అవినీతి ‘గని’!? | - | Sakshi
Sakshi News home page

ఆ ‘ఉత్తమ’అధికారి.. అవినీతి ‘గని’!?

Aug 28 2026 1:45 AM | Updated on Aug 28 2026 1:45 AM

కూతురు ఖాతాకు వసూళ్ల సొమ్ము?

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/భూపాలపల్లి: ఓ వైపు ప్రభుత్వ ప్రశంసలు.. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు.. మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొజ్జ జయరా జు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

12 జిల్లాల పర్యవేక్షణ..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గనులు, భూగర్భశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా 2024 మార్చి 15న జయరాజు బాధ్యతలు చేపట్టారు. 2025 అక్టోబర్‌ 8 నుంచి వరంగల్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఫుల్‌ అడిషనల్‌ ఇన్‌చార్జ్‌ (ఎఫ్‌ఏసీ)లో కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలో 12 జిల్లాల పర్యవేక్షణ బాధ్యత ఈ సారుపైనే ఉంది. ఈ క్రమంలో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

ఎనిమిది చోట్ల దాడులు..

జయరాజు కార్యాలయంతోపాటు ఆయన బంధువులు, సహచరులకు సంబంధించిన ప్రాంతాల్లో కలిపి మొత్తం ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆస్తుల డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.3.06 కోట్లుగా ఏసీబీ వెల్లడించింది.

రూ.40 లక్షల భవనం..

హైదరాబాద్‌ బోడుప్పల్‌లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్‌, ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. మూడు కార్లు, రెండు బైక్‌ల విలువ సుమారు రూ.40 లక్షలుగా గుర్తించారు. అదనంగా 629 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షలకు పైగా నగదు, ఎల్‌ఐసీ–మ్యాక్స్‌ లైఫ్‌ సేవింగ్స్‌, పోస్టాఫీస్‌ పొదుపులు, బ్యాంకు ఖాతాల్లో నిల్వలను అధికారులు గుర్తించారు.

ఏడీ అక్రమాస్తుల వ్యవహారంపై

మరింత లోతుగా..

ఇప్పటివరకు గుర్తించిన ఆస్తులు రూ.3.06 కోట్లుగా ఉండగా.. మరిన్ని ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆస్తుల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇసుక రవాణా వ్యవహారాల్లో ఎలాంటి వసూళ్లు జరిగాయి? డ్రైవర్‌ ఖాతా నుంచి కూతురు ఖాతాలకు బదిలీ అయిన సొమ్ముకు లెక్కలు తేల్చేపనిలో పడ్డారు ఏసీబీ అధికారులు.

ఏసీబీ కోర్టుకు ఏడీ జయరాజు..

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఏడీ జ యరాజును ఏసీబీ అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా రూ.3.06 కోట్లు అక్రమాస్తులను గురించి.. అన్ని కో ణాల్లో ఆరా తీస్తున్నామని, జయరాజును ఏసీబీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

పంద్రాగస్టుకు ప్రశంస..

15 రోజులకే ఏసీబీ దాడులు

గనులశాఖ ఏడీ జయరాజుపై కేసు

భూపాలపల్లి ఏడీతోపాటు వరంగల్‌ ఇన్‌చార్జ్‌ డీడీగా విధులు

సోదాల సందర్భంగా జయరాజు డ్రైవర్‌ సత్తునూరి యాదయ్యకు చెందిన మొబైల్‌ ఫోన్‌, బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఏసీబీకి కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. డ్రైవర్‌ ఖాతా నుంచి పలు లావాదేవీల ద్వారా జయరాజు కుమార్తె బ్యాంకు ఖాతాకు సుమారు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ విచారణలో డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తుల నుంచి సేకరించిన మొత్తాన్ని తన ఖాతాలో జమ చేసి, అనంతరం జయరాజ్‌ కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు వెల్లడించినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మొత్తాలు లంచాలుగా వసూలు చేసినవేనా? వాటి వెనుక ఎవరున్నారు? ఎలాంటి వ్యవహారాలకు సంబంధించాయి? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement