రోడ్లపై తిరుగుతున్న
ఫిట్‌నెస్ లేని బస్సులు
జిల్లా సమాచారం
తొర్రూరు: విద్యార్థులు ప్రయాణించే బడి బస్సుల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫిట్‌నెస్ లేని ప్రైవేట్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో పసి ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. తాజాగా తొర్రూరులో రెండు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రమాదానికి గురవడం వాహనాల ఫిట్‌నెస్ డొల్లతనాన్ని చూపాయి.
ఇటీవల ప్రమాదాలు..
ఈ నెల 21న తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు టైరు ఊడిపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 22న మరో ప్రైవేట్ పాఠశాల బస్సు విద్యార్థులను ఇళ్లకు తరలిస్తున్న క్రమంలో లారీని ఢీ కొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది జూలై 8న కురవి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు నల్లెల క్రాస్ రోడ్డు వద్ద లారీని ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఉపయోగిస్తున్న బస్సులు, ఇతర వాహనాల సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి వాహనాలకు ఏటా క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా సక్రమంగా జరగడం లేదని తెలుస్తోంది. అలాగే అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతంత మాత్రమే..
విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే రవాణా, పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ, చాలా వరకు ఇది అమలు కావడం లేదు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందకపోతే కాల పరిమితి ముగిసిన అనంతరం రోజుకు రూ.50 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తే ఆర్థికంగానూ, అటు వాహన నిర్వహణ పరంగానూ ప్రయోజనకరం ఉంటుంది.
బాధ్యతగా భావిస్తేనే..
సరైన సామర్థ్యం లేకుండా వాహనం బయటికి వస్తే అనుకోని ప్రమాదం జరిగితే వాటిల్లే నష్టాన్ని పూడ్చలేం. పిల్లలను తీసుకెళ్లే వాహనాల విషయంలో సంబంధిత యజమానులు, నిర్వాహకులే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆర్థిక అంశాలను, ఇతరత్రా విషయాలను సాకుగా చూపి నిర్లక్ష్యం చేయకుండా వాహనాలను సన్నద్ధం చేసుకోవాలి. బ్రేకులు, వైరింగ్ పనితీరును గమనించాలి. తగిన అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. 60 ఏళ్లు పైబడిన వారిని డ్రైవర్లుగా నియమించవద్దు. అత్యవసర ద్వారం ఏర్పాటు చేయడం, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచడం తప్పనిసరి.
పరిమితికి మించి..
రవాణాశాఖ నిబంధనలను జిల్లాలోని పలు పాఠశాలలు మొత్తంగా అమలు చేయడం లేదు. చాలా వ రకు బస్సుల్లో సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారు. బస్సుల్లో సహాయకులు ఉండడం లేదు. కిటికీలకు నిబంధనల మేరకు జాలీల ఏర్పా టు కనిపించడం లేదు. సీట్ల కింద పుస్తకాల బ్యాగులు పెట్టుకునే ఏర్పాటు లేదు. ప్రథమ చికిత్స బా క్సులు ఉన్నా వాటిల్లో మందులు ఉండడం లేదు.
పాఠశాలల బస్సులకు ప్రమాదాలు
వరుస ఘటనలతో చిన్నారులు,
తల్లిదండ్రుల్లో భయాందోళన
మండలాలు 18
ప్రైవేట్ పాఠశాలలు 128
ప్రైవేట్ బస్సులు 235
మొత్తం విద్యార్థులు 38,548


