మహబూబాబాద్ అర్బన్: రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం రహ్–వీర్ పథకం కింద రూ.25వేల నగదు బహుమతి, ప్రశంసప్రతం అందజేస్తుందని జిల్లా రవాణాశాఖ అధికారి శంకర్‌నాయక్ బుధవారం తెలిపారు. ప్రమాదం జరిగిన తొలిగంట(గోల్డెన్ అవర్) ఎంతో కీలకమన్నారు. ప్రజలు, యువకులు భయపడకుండా బాధితులకు తక్షణమే సహాయం అందించాలని ఆయన కోరారు.
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్
డోర్నకల్: పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మండలంలోని ముల్కలపల్లికి చెందిన చాగర్లమూడి శ్రీధర్ ఎన్నికయ్యారు. మహబూబాబాద్‌లో బుధవారం నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశంలో శ్రీధర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పెరుమాళ్లసంకీస ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్ గతంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడిగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పని చేశారు.
ధర్నాను విజయవంతం చేయాలి
మహబూబాబాద్ : పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్(రేవా) జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం రేవా అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ బకాయిలు చెల్లించాలని, ఆరు డీఏలు విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభానికి సబ్‌స్టేషన్ సిద్ధం
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్‌లో రూ.2.67 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సహకారంతో సబ్‌స్టేషన్ మంజూరు కాగా, డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, ప్రాజెక్ట్ సీఈ సురేందర్, ఆపరేషన్ ఎస్‌ఈ దర్శన్‌కుమార్, విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో త్వరితగతిన పనులను పూర్తి చేశారు. ఈ మేరకు ఇటీవల సబ్‌స్టేషన్‌ను విజయవంతంగా టెక్నికల్ చార్జ్ చేశారు. కాగా, సబ్‌స్టేషన్ నిర్మాణంతో కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలకు విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని, వ్యవసాయ, ఇండస్ట్రీ వినియోగదారులకు లో ఓల్టేజ్ సమస్య, అంతరాయాలు పూర్తిగా తగ్గిపోతాయని విద్యుత్ అధికారులు తెలిపారు. త్వరలోనే సబ్‌స్టేషన్‌ను రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు సమాచారం.
అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో రెండు రోజుల పాటు జరగనున్న 12వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలు, 4 అకాడమీలు, 3 క్రీడా పాఠశాలల నుంచి 1600 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు రెండు రోజుల పాటు 120 ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో పుదుచ్చేరిలో జరగనున్న సౌత్‌జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.


