మహబూబాబాద్ రూరల్ : మహ్మద్ ప్రవక్త (సల్ల ల్లాహు అలైహి వసల్లం) జీవితం మానవాళికి సత్యం, న్యాయం, శాంతి, సోదరభావం, కరుణ విలువలను బోధించిందని ముస్లిం మత గురువు మౌలానా సయీద్ అహ్మద్ రిజ్వి అన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో అహ్లే సున్నత్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ.. క్రీస్తు శకం 571లో మక్కా నగరంలో జన్మించిన మహ్మద్ ప్రవక్త చిన్ననాటి నుంచే నిజాయితీ, సత్యవంతతకు ప్రసిద్ధి చెంది అల్ అమీన్ అనే పేరును పొందారన్నారు. సత్యం, న్యాయం, మంచితనంతో జీవించాలని ప్రజలకు బోధించారని, భగవంతుడిని విశ్వసించడం, అందరినీ సమానంగా చూడడం, పేదలకు సహాయం చేయడం, అనాథలను ఆదుకోవడం, సత్యం, క్షమ, శాంతి, దయ వంటి విలువలను ప్రవక్త బోధించారని తెలిపారు. కార్యక్రమంలో ఇర్ఫాన్, అన్వర్, ఫరీద్, అసద్ అలీ ఖాన్, హారుణ్, అసిఫ్ అలీ, ఖలీద్, ఖలీల్, వహేద్, ఖాజాపాషా, ఇస్మాయిల్, మహేబూబ్ పాషా, అమీర్, జాకీర్, నయీమ్, జమీల్, యాకూబ్, అల్తాఫ్, మతీన్, ముస్లిం మతగురువులు, మతపెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


