డోర్నకల్: రైతులు మల్బరీ సాగుచేసి మెరుగైన ఆదాయం పొందవచ్చని సెరీకల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయ తెలిపారు. మండలంలోని బూరుగుపాడు గ్రామశివారులో నందిగామ రామిరెడ్డి సాగు చేస్తున్న మల్బరీ తోటను బుధవారం జేడీ అనసూయతో పాటు కేంద్ర సిల్క్ బోర్డు శాస్త్రవేత్త జె.శ్రీకాంత్‌నాయక్ పరిశీలించారు. నా పట్టు–నా అభిమానం–2.0 కార్యక్రమంలో భాగంగా బూరుగుపాడులో క్షేత్రస్థాయిలో మల్బరీ తోటను పరిశీలించి స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ మా ట్లాడుతూ.. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి పద్ధతిలో మల్బరీ సాగుతో ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని తెలిపారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రక్షణ పద్ధతిలో మల్బరీ సాగు ఉంటుందని, ఒకసారి నాటితే ఏడాదికి 5 నుంచి 6 పంటలు పొందవచ్చని తెలిపారు. ప్రతీ గ్రామంలో కనీసం 50 ఎకరాల్లో మల్బరీ సాగయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మల్బరీ తోటల సాగులో యాజమాన్య పద్ధతులు, వేరుకుళ్లు తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మైసూరు శాస్త్రవేత్త శ్రీకాంత్‌నాయక్ రైతులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సహాయ పట్టుపరిశ్రమ అధికారి సురేష్, స్థానిక రైతులు పాల్గొన్నారు.


