మినీ వ్యాన్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

మినీ వ్యాన్‌ ఢీకొని బీటెక్‌ విద్యార్థి మృతి

Aug 27 2026 1:18 AM | Updated on Aug 27 2026 1:18 AM

నలుగురికి తీవ్ర గాయాలు

వరంగల్‌కు చెందిన విద్యార్థి పరిస్థితి విషమం

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్‌ విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గురునానక్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు డిన్నర్‌ పూర్తి చేసుకొని జేబీవెంచర్‌ వైపు వాకింగ్‌ చేస్తుండగా, మాల్‌ నుంచి వేగంగా వచ్చిన టాటా మినీ వ్యాన్‌ వీరిని ఢీకొడుతూ వెళ్లి, బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరుకు చెందిన బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థి హర్షవర్ధన్‌(19) అక్కడికక్కడే మృతిచెందగా వరంగల్‌కు చెందిన మరో విద్యార్థి శివరాజ్‌ పరిస్థితి విషమంగా ఉంది. వీరితోపాటు కౌమిద్‌రెడ్డి, అక్షమ్‌, కార్తీక్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు.

శుభకార్యానికి వెళ్లొస్తూ

మృత్యుఒడికి..

గుర్తుతెలియని వాహనం ఢీకొని

వ్యక్తి మృతి

పున్నేలు క్రాస్‌ సమీపంలో ఘటన

ఐనవోలు: శుభకార్యానికి వెళ్లొస్తూ గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు క్రాస్‌ సమీపంలోని సత్యం గార్డెన్‌ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన మచ్చ కుమారస్వామి(50) ట్రాలీ డైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం ఉప్పరపల్లి క్రాస్‌ వద్ద జరిగిన బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి రంగశాయిపేటకు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్‌–ఖమ్మం రహదారిపై పున్నేలు క్రాస్‌ సమీపంలోని సత్యం గార్డెన్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బ్లాక్‌ కలర్‌ స్కార్పియో వాహనం ఢీకొన్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, భార్య పుష్ప ఉన్నారు.

దివ్యాంగురాలిని

కాపాడిన కానిస్టేబుల్‌

గూడూరు: చేద బావిలో ఓ దివ్యాంగురాలు పడుతుండగా గుర్తించిన కానిస్టేబుల్‌ సమయ స్ఫూర్తితో వెంటనే ఆమెను రక్షించాడు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గూగూరు మండలం ఏపూరులో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ దివ్యాంగ యువతి చేద బావి పక్కన కూర్చుంది. ప్రమాదవశాత్తు జారి అందులో పడింది. ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న గ్రామ సర్పంచ్‌ మౌనిక భర్త, పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్‌ గుర్తించాడు. వెంటనే ఇతరులకు సమాచారం అందించి, తాళ్ల సహాయంతో బావిలోకి దిగాడు. ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న దివ్యాంగురాలని తాళ్ల సహాయంతో ఆమెను పైకి చేర్చి ప్రాణం కాపాడాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆపదలో ఉన్న దివ్యాంగురాలిని కాపాడి మానవత్వం చాటిన దిలీప్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement