జనగామ : జనగామ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్య నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం జనగామ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైలు ఎం. భరత్, రతీష్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రాయవరం గ్రామానికి చెందిన దబ్బేటి బాలాలింగం అలియాస్ బాలు అలియాస్ ప్రవీణ్‌రాజు 2026, మే మొదటి వారంలో సహచరుడు దుబ్బేట అశోక్‌తో కలిసి బైక్‌పై జనగామ వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ రోడ్డులోని ఓ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. కాగా, ఇతర చోరీ కేసుల్లో కీసర పోలీసులు ప్రవీణ్‌రాజును అరెస్ట్ చేసి 2026, జూలై 4న చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు నుంచి ఆగస్టు 22న విడుదలైన అనంతరం జనగామలో చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు వరంగల్ వెళ్తుండగా బుధవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో 44.990 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీఐ వెల్లడించారు. కాగా, నిందితుడిపై గతంలో కూడా సుమారు 90 కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైందని, గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో పీడీ యాక్ట్ కూడా నమోదైందని సీఐ పేర్కొన్నారు. డీసీపీ రాజామహేంద్రనాయక్ సూచనల మేరకు ఏసీపీ భీంశర్మ, సీఐ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షణలో నిందితుడి అరెస్ట్‌లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన ఎస్సై భరత్, సిబ్బంది బి.కరుణాకర్, ఎన్ సాగర్, బి.కృష్ణ, బి.భాస్కర్, సాల్మన్, సీసీఎస్ వరంగల్ టీం, సీఐ రాఘవేందర్, ఎస్సై రవీందర్, హెడ్‌కానిస్టేబుల్ మహేశ్, కానిస్టేబుల్ రమేశ్‌ను సీపీ అభినందించినట్లు సీఐ తెలిపారు.
చోరీలకు పాల్పడుతున్న దొంగ
అరెస్ట్, రిమాండ్
44.990 గ్రాముల బంగారు
ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జనగామ
సీఐ సత్యనారాయణరెడ్డి


