విషాదంలో పాలకవర్గం, సిబ్బంది
హన్మకొండ చౌరస్తా/ఆత్మకూరు/ఖిలా వరంగల్:/హన్మకొండ అర్బన్: ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. మృత్యువు ఒక్కొక్కరిని తన ఒడికి చేర్చుకుంది. రెండేళ్లలో కుటుంబాన్ని మొత్తం కబళించింది. రెండేళ్ల క్రితం కొడుకు, ఐదు నెలల క్రితం భర్త మృతి చెందగా.. శనివారం భార్య సైతం అనంతలోకాలకు చేరుకుంది. హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన వరంగల్ మార్కెటింగ్ శాఖ అధికారి (డీఎంఓ) కలకోట్ల సురేఖ(43) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలుసుకున్న స్థానికుల రోదనలతో పెద్దమ్మగడ్డ దుఃఖసాగరంలో మునిగిపోయింది.
మృత్యుపాశమైన ఇసుకలారీ..
హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కలకోట్ల సురేఖ వరంగల్ డీఎంఓగా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ ఇన్‌చార్జ్ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఆమె గుడెప్పాడ్ మార్కెట్ యార్డులో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో చింత విజయబాబు అనే వ్యక్తితో కలిసి ఏటూరునాగారం వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో సురేఖతోపాటు విజయబాబు కూడా దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో కొడుకు..
అనారోగ్యంతో భర్త
సురేఖ, కిరణ్ స్వస్థలం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అయినప్పటికీ పదిహేనేళ్ల క్రితం జూలైవాడలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. సురేఖ ఒక్కగానొక్క కుమారుడు సుక్రీత్ (16) రెండేళ్ల క్రితం క్రికెట్ ఆడేందుకు స్కూటీపై వెళ్తుండగా.. బాలసముద్రంలోని హయగ్రీవాచారి గ్రౌండ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్ ఢీకొట్టడంతో అతడు మృతి చెందాడు. సురేఖ భర్త బొక్క కిరణ్ (50) అనారోగ్యంతో బాధపడుతూ ఐదు నెలల క్రితం మృతి చెందాడు. శనివారం సురేఖ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండేళ్లలో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరినట్లయ్యిందని కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
చివరి స్టేటస్‌లో కొడుకు జ్ఞాపకాలు..
పతాకావిష్కరణ అనంతరం సురేఖ తన విధి నిర్వహణకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కుమారుడు బతికున్నప్పుడు పాఠశాలలో దిగిన ఫొటోలు, అతడితో సరదాగా గడిపిన సందర్భాల ఫొటోలను కూడా స్టేటస్‌గా ఉంచుకున్నారు.
తల్లిదండ్రులకు తీరని శోకం
కొడుకు, భర్త మరణించిన తర్వాత సురేఖ తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జూలైవాడలోని ఇంట్లో నివసిస్తున్నారు. సురేఖ తండ్రి సురేందర్ సీపీఓ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. కూతురుకు వరుసగా ఎదురైన విషాదాలను తలచుకుంటూ ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘ముందు మనవడిని.. ఆ తర్వాత అల్లుడిని కోల్పోయాం.. ఇప్పుడు కూతురిని కూడా కోల్పోయాం.. ఈ ఘోరాన్ని ఎలా భరించాలి..?’ అంటూ బంధువులను పట్టుకుని వారు గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. సురేఖకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సురేఖ మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అప్పటివరకు తమతో ఉన్న అధికారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్న విషయం తెలియగానే గూడెప్పాడ్ మార్కెట్ పాలకవర్గం, సిబ్బంది, వరంగల్ మార్కెటింగ్‌శాఖ అధికారులు విషాదంలో మునిగిపోయారు. మంచి అధికారిని కోల్పోయామని పాలకవర్గం విచారం వ్యక్తం చేసింది. సిబ్బంది.. అధికారి సురేఖతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు.
ఒకే కుటుంబంలో
రెండేళ్లలో ముగ్గురు మృతి
తాడ్వాయి రోడ్డు ప్రమాదంలో వరంగల్ డీఎంఓ సురేఖ దుర్మరణం
కన్నీరు మున్నీరైన బంధువులు


