● ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్
మహబూబాబాద్: ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్‌కార్డులు ఇస్తుందని, ఇది లబ్ధిదారుల గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కలెక్టరేట్‌లో ప్రధాన సమావేశ మందిరంలో శనివారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్మార్ట్ రేషన్ కార్డుకు భద్రత ఉంటుందన్నారు. ఆరోగ్య పథకాలు, విద్యా ఫీజు రాయితీలు ఇతర ప్రయోజనాలకు కార్డు ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతీ కుటుంబానికి చేరవేయడంలో జిల్లా ముందంజలో ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాకు మంజూరైన 2,78,379 స్మార్ట్ రేషన్ కార్డులను మండలస్థాయి అధికారులు ఎమ్మెల్యే ద్వారా 15 రోజుల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్‌జ్యోతి, డీసీఎస్‌ఓ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పంట మార్పిడిపై విస్తృత ప్రచారం చేయాలి
పంట మార్పిడి విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం సాగునీటి పారుదల కమిటీ, వ్యవసాయ సలహాలు, సూచనల కమిటీల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ రైతు ఆరుతడి పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. కూరగాయల సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ స్నేహశబరీష్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


