● జిల్లా జడ్జి మురళీమోహన్
మహబూబాబాద్ రూరల్ : ప్రజలకు సత్వర న్యాయం అందించడం న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తమ వంతు బాధ్యతగా గుర్తించాలని జిల్లా జడ్జి మురళీమోహన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయస్థాన ప్రాంగణంలో శనివారం జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెళ్లి, ప్రధాన జూనియర్ సివిల్ న్యాయమూర్తి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి అర్వపల్లి కృష్ణతేజ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
కేయూ అభివృద్ధికి ప్రతిపాదనలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనాభవనం ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. 50 ఏళ్ల కేయూ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ లక్ష్యాల వైపు మరింత దృఢంగా సాగాలని పిలుపునిచ్చారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమం, పరిపాలనా సంస్కరణల్లో విశ్వవిద్యాలయం గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. రూసా ప్రాజెక్టు ద్వారా రూ.50 కోట్లతో వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాలకు ఏఐసీటీ అనుమతి లభించిందన్నారు. కేయూలోని గ్రంథాలయ అభివృద్ధికి రూ.కోటి కేటాయించామని తెలిపారు. వేడుకల్లో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్‌డీ ఆచార్య వెంకట్రామ్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ సురేష్‌లాల్, రమ, సుదర్శన్, అనితారెడ్డి, సుకుమారి, చిర్ర రాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బోధన, బోధనేతర ఉద్యోగులకు నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు వీసీ, రిజిస్ట్రార్ బహుమతులు అందజేశారు. తొలుత వీసీ ప్రతాప్‌రెడ్డి.. ఎన్‌సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు.


