వేటు పడుతోంది.. | - | Sakshi
Sakshi News home page

వేటు పడుతోంది..

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

సాక్షి, మహబూబాబాద్‌: మొదటి నుంచి జిల్లా అధికారులను రాష్ట్రంలోనే ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. చిన్న అధికారుల నుంచి పెద్దస్థాయి అధికారుల వరకు అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే మానుకోట వివాదాలకు నిలయంగా మారింది. ఆ పేరును చెరిపేందుకు చేసే ప్రయత్నాలు కొన్ని సఫలమైనా.. మరికొన్ని మాత్రం వెంటాడుతున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ఇక్కడ పనిచేసే సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్ప డిన వారిలో కొందరు బయటకు వెళ్లగా.. మరికొందరు ఏసీబీకి చిక్కారు.. ఇంకొందరు జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన కొద్దిరోజులకే ఏసీబీకి పట్టుపడ్డారు. అయితే, తాజాగా కూడా జిల్లాలోని పలుశాఖలు అవినీతిమయంగా మారడం.. ఇద్దరిపై వేటు పడటం.. మరికొందరు ఆరోపణలు ఎదుర్కోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇద్దరిపై వేటు

అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఇందులో జిల్లాలోని చెరువుల లీజు, మత్య్స సొసైటీల సభ్యత్వాల నిధులు ఎవరికి చెప్పకపోవడం, కలెక్టర్‌కు నోట్‌ ఫైల్‌ కూడా పెట్టకుండా రూ.46లక్షల డ్రా చేసి దగ్గర పెట్టుకున్నారు. దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. నిజ నిర్ధారణ కావడంతో జిల్లా మత్య్సశాఖ అధికారి భాస్కర్‌ను సస్పెండ్‌ చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయకుండా తమ వద్ద పెట్టుకున్నారనే ఆరోపణలు, కనీసం ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వకపోవడం, ఎంపీడీఓలు ఖర్చుచేసిన డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు పెట్టిన ఆరోపణపై జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన హరిప్రసాద్‌ను పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

మరికొందరిపై ఆరోపణలు..

తాజాగా కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం జిల్లాలో చర్చగా మారింది. ఇందులో జిల్లా వైద్యారోగ్యశాఖలో పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహణ కోసం ముందుగా విడుదల చేసిన నిధులను కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఇవ్వని విషయంపై ఇటీవల జిల్లాకు చెందిన కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర పనుల్లో అవకతవకలు జరిగాయని, పలు గ్రామాల్లో పనులు చేయకుండానే ఎన్‌బీలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో సంబంధిత అధికారుల చేతివాటంతోనే కొందరు కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. గిరిజన సంక్షేమశాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయలు చేతులు మారినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే విధంగా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ కార్యాలయాల్లో అక్రమాలు జరిగిన విషయంపై ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం.

జిల్లాలోని పలుశాఖల అధికారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంల్లో జిల్లా ఉన్నతాధికారి ప్రతీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చిన ఆరోపణలల్లో నిజం ఎంత ఉంది.. ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చాయి.. ఆరోపణలు చేసిన వారు ఎవరు... వారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణాల్లో పరిశీలన జరుగుతున్నటు సమాచారం. దీంతో అక్రమాలకు పాల్పడిన అధికా రుల గుండెల్లో దడ పుడుతోంది.

అవినీతికి పాల్పడుతున్న కొందరు జిల్లా అధికారులు

ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

మరికొందరిపై కొనసాగుతున్న ఫిర్యాదులు

విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు చర్చ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement