ప్రారంభమెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమెప్పుడో..?

Aug 12 2026 3:10 AM | Updated on Aug 12 2026 3:10 AM

మహబూబాబాద్‌: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారు. ఈమేరకు అగ్రిమెంట్‌ పూర్తి చేసి నెల దాటినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. డిజైన్‌ డ్రాయింగ్‌ విషయంలో జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, గడువులోపు పనులు పూర్తయ్యేనా అని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు.

రూ.12 కోట్లు కేటాయింపు..

మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.59కోట్లు విడుదల చేయించారు. ఆ నిధుల నుంచి రూ.12 కోట్లు వరద కాల్వల కోసం కేటాయించారు. రూ 5.50 కోట్లు, రూ.6.50 కోట్ల చొప్పున రెండు ప్యాకేజీల్లో కేటాయించినట్లు మున్సిపల్‌ ఇంజనీర్‌ విభాగం అధికారులు తెలిపారు. కాగా గతంలో బస్తీదవాఖానా ఎదుట, బ్రహ్మకుమారీస్‌ మందిరం సమీపం, పీఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలోని రాహుల్‌ నగర్‌లో మేజర్‌ వరద కాల్వలు నిర్మాణం చేశారు. వాటితో పాటు 10 మైనర్‌ వరద కాల్వల నిర్మాణం చేశారు.

చెరువులకు అనుసంధానం..

వరద కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తారు. దీంతో నీరు వృథా కాదు. భూగర్భ జలాలు పెరుగుతాయి. ముంపు సమస్య తీరుతుంది. అనుసంధానం అంతా ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాగా, పట్టణంలోని స్నేహనగర్‌, రామన్నపేట, మన్మదతోట ప్రాంతం, గుండ్ల కుంట చెరువు ప్రాంతం, జమాండ్లపల్లిలోని కొంత భాగం, బంధం చెరువు ప్రాంతం తదితర ప్రాంతాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని కాల్వల నిర్మాణం చేయనున్నారు.

డిజైన్‌ డ్రాయింగ్‌లో ఆలస్యం..

కాల్వల నిర్మాణ అగ్రిమెంట్‌ పూర్తయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. కాగా ఆ శాఖ వరంగల్‌లోని ఎస్సీ కార్యాలయానికి డిజైన్‌ డ్రాయింగ్‌ కోసం పంపారు. కానీ, ఆ డిజైన్‌ రాలేదు. దీంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

ఏడాది మాత్రమే గడువు..

కాల్వల నిర్మాణానికి ఏడాది మాత్రమే గడువు ఇచ్చారు. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. త్వరగా డిజైన్‌ పూర్తి చేసి కాల్వల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాల్వల నిర్మాణంతో ముంపు సమస్య తీరుతుందని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆప్రాంతాలను పలుమార్లు అధికారులు పరిశీలిస్తున్నారే తప్ప పనులు మాత్రం ప్రారంభించడం లేదు.

కాల్వల నిర్మాణప్రాంతాల గుర్తింపు..

బంధం చెరువు నుంచి పాషివాగు మీదుగా జనాల చెరువుకు వరద కాల్వ నిర్మాణం చేస్తారు.

జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌ సమీపంలోని సెవెన్‌హిల్స్‌ నుంచి బంధం చెరువు వరకు..

నర్సంపేట ఎన్‌హెచ్‌ బైపాస్‌ నుంచి గుండ్లకుంట చెరువు వరకు..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కాలేజీ నుంచి నిజాంచెరువు వరకు..

హస్తినాపురం నుంచి నిజాం చెరువు, సిగ్నల్‌ కాలనీ నుంచి రైల్వే ట్రాక్‌ కింద నుంచి నిజాం చెరువు, నిజాం చెరువు నుంచి రాబంద్రు చెరువు వరకు కాల్వ నిర్మాణం చేయనున్నారు.

అగ్రిమెంట్‌కే పరిమితమైన వరద కాల్వల నిర్మాణం

డిజైన్‌ డ్రాయింగ్‌లో తీవ్ర జాప్యం

పలుమార్లు అధికారులు ముంపు ప్రాంతాల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement