ఇలా అయితే నీళ్లకోసం కొట్లాటలే? | - | Sakshi
Sakshi News home page

ఇలా అయితే నీళ్లకోసం కొట్లాటలే?

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

హసన్‌పర్తి : రానున్న రోజుల్లో నీళ్ల కోసం తమ తమ నియోజకవర్గాల ప్రజల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. నీటి పారుదలశాఖ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. దేవాదుల నీటివిడుదలపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు. చింతగట్టులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈఎన్‌సీ రమేశ్‌ అధ్యక్షత మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో స్టేషన్‌ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పాలకుర్తి, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్‌.నాగరాజు, యశస్వినిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో వర్షాలు కురవకపోతే గోదావరిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందన్నారు. సమ్మక్క బ్యారేజీని పూర్తిస్థాయిలో నింిపి సిద్ధం ఉంచాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రానున్న 45 రోజుల పాటు పూర్తి స్థాయిలో మోటార్ల సాయంతో నిరంతరం నీరు అందించాలని ఆదేశించారు. ధర్మసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు టన్నెల్‌ పనులు పూర్తయినా నేటివరకు వినియోగంలోకి రాలేదన్నారు. భీమ్‌గణపురం, గణపురం చెరువులను నింపి తాగునీరు అందించాలని చెప్పారు. దేవాదుల రిజర్వాయర్లలో నీటి నిల్వల ద్వారా పంటలకు సాగు నీరు అందించే అవకాశాలను పరిశీలించి నీరు విడుదల చేయాలని సూచించారు. దేవాదుల ఫేజ్‌–3 ప్యాకేజీ–6 ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో 78 వేల ఎకరాల సాగు నీరు అందించే అవకాశం ఉందన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. మంజూరైన పనులు చేపట్టాలని తిరుగుతన్నా.. స్పందన లేదన్నారు. కనీసం ఫోన్‌చేసిన అధికారులు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇదే అవకాశంగా భావించిన ప్రతిపక్షాలు తమపై దుమ్మెత్తి పోస్తున్నారని వాపోయారు. తన మాటలు లెక్కచేయడం లేదని, మంత్రి సీతక్క ఆదేశిస్తే రామప్ప నుంచి తన నియోజకవర్గానికి నీరు విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్‌.నాగరాజు మాట్లాడుతూ.. కోనారెడ్డి చెరువును రిజర్వాయర్‌గా ఏర్పాటు చేయాలని కోరారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ప్యాకేజీ–6 పనులు నత్తనడకన నడస్తున్నాయని, వెంటనే ఆ పనులు వేగవంతం చేసి రైతులకు సాగు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఈలు సుధీర్‌, ధర్మ, ఎస్‌ఐ రాంప్రసాద్‌, సీతారాంనాయక్‌, స్వామి, రామకృష్ణ, డీఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

అధికారుల తీరుపై

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపాటు

సీతక్క చెబితేనే నీళ్లు విడుదల చేస్తున్నారు: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement