హన్మకొండ : లండన్‌కు లార్డ్ అయినా జన్మభూమికి ముద్దుబిడ్డనేనని బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు పేర్కొన్నారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ సమన్వయంతో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హనుమకొండ రాంనగర్‌లోని నిత్య బాంక్వెట్ హాల్‌లో బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత ఉదయ్ కుమార్ నాగరాజు మాట్లాడుతూ.. ప్రధాని అందించిన ఈ పదవిని హోదా కన్నా ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో జరిగిన సీటా ఒప్పందం భవిష్యత్‌లో దౌత్యపరమైన సంపదను పెంచుతుందని, ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొన్న 20 మందిలో ఒకరిగా నిలవడం అదృష్టంగా భావిస్తూ ఇద్దరు ప్రధానమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. లండన్‌లో ఉన్న భారతీయులను, ముఖ్యంగా తెలుగు/తెలంగాణ ప్రజలను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కవి, గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మట్టి కీర్తిని ఉదయ్ కుమార్ నాగరాజు విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఆయన సామాజిక దృక్పథాన్ని, విజ్ఞాన వికాసాన్ని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’గా నామినేట్ చేసిందన్నారు. మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మార్తినేని ధర్మారావు, వొడితల సతీష్ కుమార్, నన్నపునేని నరేందర్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, కుటుంబ సభ్యులు శాలువా కప్పి, జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు.
బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు


