సర్‌ ముగింపు | - | Sakshi
Sakshi News home page

సర్‌ ముగింపు

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

సాక్షి, మహబూబాబాద్‌: జిల్లాలో ఎస్‌ఐఆర్‌(సర్‌) ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని ఓట్లు భద్రంగా ఉన్నాయి.. ఎన్ని ఓట్లు తొలగించనున్నారని అధికారులు లెక్కలు వేస్తున్నారు. కాగా, జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లోని 555 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 48,144 ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. ఈమేరకు డ్రాఫ్ట్‌ జాబితాను ఈనెల 17న విడుదలు చేసి అభ్యంతరాలు రాకపోతే తొలిగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

48,144ఓట్లు తొలగించే అవకాశం

జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,84,935 మంది ఓటర్లు ఉన్నారు. బూత్‌లెవల్‌ అధికారులు మాత్రం 4,36,791 మంది ఓటర్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. మరో 3,013 మంది ఓటర్లు ఆన్‌లైన్‌ ద్వారా ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేశారు. మొత్తంగా 4,36,735మంది ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసి, పూరించిన తర్వాత తీసుకున్నారు. ఇందులో ముందుగా ప్రకటించిన విధంగా 2002 ఓటరు జాబితా ప్రకారం రక్తసంబంధీకుల ఓటర్లతో సరి అయినవి 2,40,970 ఓట్లు ఉండగా, 2025 జాబితాలో ఓటు ఉన్నవారు 1,80,883 మంది ఉన్నారు. వీరుపోగా అటు రక్తసంబంధీకులతో, ఇటు స్వయంగా జాబితాలో లేకుండా దేనితో సరికాని వారు 14,882 మంది(3.07శాతం) ఇతర కుటుంబ సభ్యులతో కలిపి ఫారాలు భర్తీ చేశారు. వీరు పోగా మిగిలిన వారిలో 9,376 మంది మరణించారు. 29,785 మంది ప్రస్తుతం ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతానికి ఓటు మార్చుకున్నారు. వీరితోపాటు 8,853 మందికి ఇతర ప్రాంతాల్లో కూడా ఓటు ఉన్నట్లు గుర్తించారు. ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో ఉండి అందుబాటులో లేనివారు 862 మందిని గుర్తించారు. ఇలా మొత్తంగా 48,144మంది ఓటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసి సరైన సమాధానం, ఆధారాలు చూపకపోతే ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది.

సవరణ జాబితాలో 76,928 ఓట్లు..

ఓటరు సవరణ కార్యక్రమంలో తలెత్తిన సమస్యలు, తప్పులుగా నమోదు కావడం మొదలైన కారణాలతో జిల్లాలో 76,928 ఓట్లను సవరణ జాబితాలో చేర్చారు. ఇందులో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, మరణించిన వారు(ఏఎస్‌డీ) మొత్తం 3,473 మంది ఉన్నారు. అదే విధంగా ఇంటిపేరు, తండ్రిపేరు, పేర్లు తప్పుగా నమోదు అయిన వారు 4,281 మంది, ఇతర వయస్సు, వారసుల పేర్లు తప్పు మొదలైన కారణాలతో సవరణ జాబితాలో చేర్చిన వారు 69,174 మంది ఉన్నారు. మరోసారి పరిశీలించి వారి వద్ద ఉన్న నిజమైన ఆధారాలతో సవరణ చేయనున్నారు.

జిల్లాలో 842 గ్రామ పంచాయతీలు, 600లకు పైగా ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. అదివాసీ గూడేలు, తండాల నుంచి సమీపంలోని తొర్రూరు, నర్సంపేట, మహబూబాబాద్‌, మరిపెడతో పాటు ఇతర జిల్లాలు ఖమ్మం, వరంగల్‌, హైదరాబాద్‌, సూరత్‌, బీమండీ, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి జీవిస్తున్నారు. అయితే, తాము ఎక్కడ ఉన్నా .. తమ సొంత గ్రామంలోనే మా ఓటు హక్కు కలిగి ఉండాలనే ఆలోచనతో ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సమాప్తం

తొలగించేందుకు సిద్ధంగా 48,144 ఓట్లు

17న డ్రాఫ్ట్‌ జాబితా విడుదల

అభ్యంతరాల స్వీకరణ, సవరణకు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement