– 8లోu
వెంకటాపురం(కె): తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పామూనూరు, తడపల బెస్ క్యాంపులను పరిశీలించి తెలంగాణ బోర్డర్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఛత్తీస్‌గఢ్ 196 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంప్‌ను పరిశీలించి సీఆర్‌పీఎఫ్ అధికారులు, ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పామూనూరు గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకర్లతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టల చిత్రం మారిందన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పోలీస్, రెవెన్యూ, అటవీశాఖతో పాటు అన్ని శాఖల అధికారుల బృందం పర్యటించిందన్నారు. ఐదు దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండి, భద్రతా దళాలకు అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న కర్రెగుట్టల అటవీప్రాంతంలో చారిత్రక మార్పు చోటు చేసుకుందని వెల్లడించారు. ఆపరేషన్ కగార్‌తో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో పాటు పలువురు లొంగిపోయారని వివరించారు. ప్రస్తుతం ముప్పాల లక్ష్మణ్‌రావుతో పాటు ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన ప్రధాన నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. మావోయిస్టుల ప్రభావం తగ్గడంతో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రివార్డుల మొత్తం, ఆర్థికసాయం, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ సదుపాయాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, ఎస్‌ఐబీ అడ్మిన్ సింధుశర్మ, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ మనన్‌భట్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
లొంగిపోయిన వారికి
ఉపాధి కల్పిస్తాం
డీజీపీ సీవీ ఆనంద్
పామూనూరు, తడపల బేస్ క్యాంపుల పరిశీలన
ఆపరేషన్ కగార్‌తో
700మంది లొంగుబాటు


