జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వర్షాధారమే దిక్కు..
సాక్షి, మహబూబాబాద్: భూమినే నమ్ముకొని జీవిస్తున్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతీ సంవత్సరం వర్షం కురిస్తేనే పంటలు పండుతున్నాయి. వర్షాలు లేకపోతే ఏజెన్సీ అంతా ఏడారిగా మారుతుంది. కాగా, ఎన్నికల సమయంలో గోదావరి జలాలు తరలిస్తామని నాయకులు చెబుతున్నారే తప్ప.. ఆచరణలో చూపడం లేదు. ప్రభుత్వాలు కరుణించి గోదావరి నీటిని ఎత్తిపోస్తేనే జిల్లాలోని కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల రైతుల సాగునీటి గోస తీరుతుంది.
తలాపున నీళ్లు.. పొలాలు బీళ్లు
తలాపున నీళ్లు.. పొలాలు బీళ్లు అన్నట్లు ఉంది.. కొత్తగూడ మండలం రైతుల పరిస్థితి. కాకతీయుల కాలం నాటి పాకాల చెరువు కట్టమాత్రం వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో ఉండగా.. చెరువు విస్తీర్ణం మాత్రం కొత్తగూడ మండలంలోని గ్రామాల్లో ఉంటుంది. నీటి నిల్వ పెరిగితే ఈ ప్రాంతం గ్రామాలే ముంపునకు గురవుతాయి. ఇక్కడి ప్రజలే ఇబ్బందులు పడుతారు. కానీ కొత్తగూడ మండలంలోని ఒక్క గ్రామానికి కూడా పాకాల చెరువు నుంచి పంటలకు నీరు మాత్రం రాదు.
ఎత్తిపోస్తేనే.. భూములు సస్యశ్యామలం
పాకాల చెరువు నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తేనే ఏజెన్సీ మండలాల్లో భూములు సస్యశ్యామలంగా మారుతాయి. గోదావరి జలాలు ఇప్పటికే ములుగు జిల్లాలోని రామప్ప చెరువు నుంచి పాకాల చెరువులోకి ఎత్తిపోస్తున్నారు. కాగా, పాకాల చెరువు బ్యాక్ వాటర్‌ను కొత్తపల్లి, పొగుళ్లపల్లి గ్రామాల మధ్యలో లిఫ్ట్‌పెట్టి ఎత్తిపోయాలి. ఇలా సుమారుగా 10కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ పైపులైన్లు వేసి మధ్యలో చెరువులు నింపుతూ గంగారం మండలం తిరుమలగండి చెరువు నుంచి పందిపంపుల వాగు వరకు తీసుకెళ్లాలి. ఇలా చేస్తే కొత్తపల్లి, వేలుబెల్లి, ముస్మి, పోలారం, బత్తులపల్లి, కార్లాయి, గోపాలపురం, తాటివారి వేంపల్లి, పొగుళ్లపల్లి, ఓటాయి, కోనాపురం, సాధిరెడ్డిపల్లి, జంగంవానిగూడెం, గంగారం మండలం తిరుమలగండి, పుట్టలభూపతి, మడగుడెం, గంగారం గ్రామాలకు సాగునీరు వెళ్తుంది. అక్కడి నుంచి పందిపంపుల వాగులో నీటిని వదిలితే బయ్యారం పెద్దచెరువు గోదావరి జలాలతో నిండుతుంది. తద్వారా కొత్తగూడ, గంగారం మండలాలతోపాటు బయ్యారం, గార్ల మండలాల్లోని ప్రత్యక్షంగా 50వేల ఎకరాలు, పరోక్షంగా మరో 50వేల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుంది.
ఎన్నికల హామీగానే..
పాకాల నీటిని ఎత్తిపోసే పథకం ఎన్నికల హామీగానే మిగిలింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే చందూలాల్ ఈ వాగ్దానమే ముందుకు తీసుకొచ్చారు. తర్వాత వరుస ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి సీతక్కతోపాటు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే హామీ ఇచ్చారు. అయితే సీతక్క మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ పథకం కోసం సర్వే చేయించారు. లిఫ్ట్ ద్వారా పదికిలో మీటర్ల మేరకు భూగర్భ పైపులైన్‌తో నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులతో రూ.300కోట్ల బడ్జెట్‌తో అంచనాలు వేశారు. అయితే రెండేళ్లు అయినా దీనిపై మళ్లీ మాట్లాడడం లేదు.
ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం..
పాకాల చెరువు నుంచి కొత్తగూడ, గంగారం మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం సర్వే చేయించాం. పరిపాలనా అనుమతులు, బడ్జెట్ కేటాయింపులు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
ఎన్నికల హామీగానే గోదావరి జలాల తరలింపు
పాకాల చెరువు నుంచి ఎత్తిపోయాలని రైతుల డిమాండ్
పందిపంపుల వాగులోకి లిఫ్ట్ చేస్తే బయ్యారం చెరువుకు జలకళ
లక్ష ఎకరాలకు సాగునీరు
అందే అవకాశం


