మహబూబాబాద్: మానుకోట పట్టణంలో ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లు, చిల్డ్రన్స్ పార్క్‌లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. జిమ్‌లోని పరికరాలు, ఆట వస్తువులు పాడైపోతున్నాయి. వాటి మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కురుస్తున్న వర్షాలతో పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీంతో విషపురుగులు సంచరిస్తాయని ప్రజలు అటు వైపు వెళ్లడం లేదు.
ఆరోగ్యం, ఆహ్లాదం కోసం..
మానుకోట పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజలు ఆహ్లాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడు పార్క్‌లు, తొమ్మిది జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఆహ్లాదం, ఆరోగ్యంతో పాటు గ్రీన్ ల్యాండ్‌ల పరిరక్షణలో భా గంగా వాటిని ఏర్పాటు చేశారు. ప్రహరీ ఏర్పాటు చేయడంతో కబ్జాకు గురికాకుండా ఉంటున్నాయి.
ఏడు పార్కులు..
మానుకోట పట్టణంలోని ఎన్జీఓఎస్ కాలనీ, ఇందిరాగ్రౌండ్, బ్రహ్మకుమారి మందిరం సమీపంలో, మహర్షి విద్యాలయం సమీపం, హౌజింగ్ బోర్డు కాలనీతో పాటు కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో కంబాలచెరువు పక్కన పార్క్ ఏర్పాటు చేశారు. 18వ వార్డు పరిధిలో బటర్‌ఫ్లై పార్క్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తొమ్మిది ఓపెన్ జిమ్‌లు..
ఎన్జీఓఎస్ కాలనీలోని పార్క్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఇందిరాగ్రౌండ్‌లోని త్రివర్ణ పార్క్‌లో, బ్రహ్మకుమారి మందిరం సమీపంలోని పార్క్‌లో, యశోద గార్డెన్ ఎదుట, ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, శనిగపురం, హైమా గార్డెన్, కంకరబోడ్‌లో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేశారు.
నిర్వహణ లేక అధ్వానంగా..
పార్క్‌లు, జిమ్‌లు, చిల్డ్రన్స్ పార్క్‌లు నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. వర్షాకాలంలో వాటి పరి స్థితి మరి దారుణంగా మారింది. ఏపుగా పెరిగిన మొక్కలతో వాకర్స్ నడవడం కష్టంగా మారింది. విషపురుగులు, పాములు ఉంటాయని వాకర్స్ జంకుతున్నారు. పార్క్‌ల్లోని ఆట వస్తువులు, ఊయల ఇతర పరికరాలు చాలా వరకు పాడైపోయాయి. ఓపెన్ జిమ్‌లలో వ్యాయామ వస్తువుల కింద ఉన్న మ్యాట్‌లు పూర్తిగా పాడైపోయాయి. కేవలం సిమెంట్ ప్లాట్‌ఫాం మిగిలింది. మ్యాట్‌లు ఉన్నప్పుడు వ్యాయాయం చేసేందుకు చాలా అనుకూలంగా ఉండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరమ్మతుల్లో జాప్యం..
జిమ్ పరికరాలు, ఆట వస్తువుల మరమ్మతులు చే యడంలో మున్సిపల్ అధికారులు జాప్యం చేస్తున్నారు. ప్రత్యేకంగా బడ్జెట్ లేదని అంటున్నారు. కౌ న్సిల్ ఆమోదం ద్వారా ప్రత్యేక గ్రాంట్ నిధులు వి డుదల చేస్తే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది.
మానుకోటలో అధ్వానంగా పార్క్‌లు,
ఓపెన్ జిమ్‌లు
పాడైపోతున్న జిమ్ పరికరాలు,
ఆట వస్తువులు
వర్షాలతో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు
పందులకు నిలయంగా చిల్డ్రన్స్ పార్క్‌లు
పందులకు నిలయంగా చిల్డ్రన్స్ పార్క్‌లు..
జిల్లా కేంద్రంలోని ఎన్జీఓఎస్ కాలనీ, కృష్ణకాలనీతో పాటు పలు కాలనీల్లో చిల్డ్రన్స్ పార్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అయితే చుట్టూ ప్రహరీలు లేకపోవడంతో చిల్డ్రన్స్ పార్క్‌లు పందులకు నిలయంగా మారాయి. పందులతో ఆప్రాంత పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమల సంఖ్య పెరిగి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


