డీపీఓ ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

డీపీఓ ఆకస్మిక తనిఖీ

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

కురవి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీపీఓ రేవంత్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామాభివృద్ధిపై పంచాయతీ కార్యదర్శికి పలు సూచనలు చేశారు. వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ స్వరూప, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ గౌస్‌, సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, పంచాయతీ కార్యదర్శి వేద రాజేశ్‌ పాల్గొన్నారు. కాగా డీపీఓ రేవంత్‌ మొదటి సారి కురవి గ్రామ పంచాయతీకి రావడంతో సర్పంచ్‌ బాదావత్‌ లక్ష్మీరాజునాయక్‌, వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దైద భద్రయ్యలు సన్మానించారు.

ప్రీ ప్రైమరీ సిబ్బంది

నియామక జాబితా విడుదల

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామక జాబితాను గురువారం ఎట్టకేలకు విడుదల చేశారు. నియామకాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, అర్హుల ఎంపికలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు జాబితను విడుదల చేశారు. దీంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెల 7వ తేదీ నుంచి ఇన్‌స్ట్రక్టర్లకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో మూడు రోజులపాటు క్రయవిక్రయాలు బంద్‌ ఉంటాయని మార్కెట్‌ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌ గురువారం తెలిపారు. శని, ఆదివారాల్లో వారాంతపు సెలవులు, సోమవారం బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం సెలవురోజుగా ప్రకటించిందన్నారు. మళ్లీ మంగళవారం యథావిధిగా వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. రైతులు సెలవురోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురికావద్దని ఆయన పేర్కొన్నారు.

ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం

నెహ్రూసెంటర్‌: ఆదివాసీల స్వయం పాలన, రాజ్యాధికారం, హక్కుల కోసం పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ పిలుపునిచ్చారు. ఆగస్టు 9న ఆదివాసీ పోరాట దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, అటవీ హక్కులు, వనరుల కోసం, హక్కుల సాధనకే ఆదివాసీలు ఏళ్లుగా పారాటాలు సాగిస్తున్నారని, వారి పోరాటాల ఫలితంగానే పెసా చట్టం, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం వచ్చాయన్నారు. అనంతరం న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గానికి చెందిన 15 కుటుంబాల వారు ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరారు. కార్యక్రమంలో బానోత్‌ ఉక్లా, ఆరెం కొటమ్మ, బానోత్‌ దేవేందర్‌, ఇరుగు నాగన్న, గణేష్‌, శివ, నారాయణ, సిద్దబోయిన జీవన్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలి

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపునిచ్చారు. బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 6నుంచి దేశ వ్యాప్తంగా పార్టీ ప్రజా చైతన్య ప్రచార యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించారు. మహబూబాబాద్‌ మండలంలోని ముడుపుగల్లు గ్రామంలో అమరజీవి తండా రామచంద్రు స్తూపం వద్ద సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర గురువారం ప్రారంభించారు. విజయసారథి మాట్లాడుతూ.. 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. ధరలను నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవడంలో మోదీ విఫలమయ్యారని అన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బి.అజయ్‌ సారథిరెడ్డి, నాయకులు పాండురంగచారి, సందీప్‌, లింగ్యనాయక్‌, కుమార్‌, సాంబలక్ష్మి, వెంకన్న, రవి, వీరన్న, రవీందర్‌, రమేష్‌, వేణు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement