ఆర్థిక భారం.. కోచింగ్‌కు దూరం | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక భారం.. కోచింగ్‌కు దూరం

Jul 31 2026 12:45 AM | Updated on Jul 31 2026 12:45 AM

న్యూశాయంపేట : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాల సాధన యజ్ఞంలా మారింది. ఏటా వేల సంఖ్యలో నోటిఫికేషన్లు వస్తున్నా సరైన మార్గదర్శకం, నాణ్యమైన శిక్షణ లేక మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ద, జైన్‌) నిరుద్యోగ యువత రేసులో వెనుకబడి పోతోంది. మార్కెట్‌లోని కార్పొరేట్‌ కోచింగ్‌ సెంటర్ల భారీ ఫీజులు మరోవైపు వారి కలలను ఆవిరిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనార్టీ నిరుద్యోగుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్ల ఏర్పాటు సత్వర అవసరంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మాదిరిగానే మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు కూడా ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంలో మైనార్టీ స్టడీ సర్కిల్‌ కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని మైనార్టీ మేధావులు, నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

నగరాలకు వెళ్లి శిక్షణ పొందాలంటే

తడిసిమోపెడు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మైనార్టీ నిరుద్యోగుల్లో మెజార్టీ సంఖ్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే. గ్రూప్స్‌, బ్యాకింగ్‌, రైల్వే, పోలీస్‌ కొలువుల కోసం హైదరాబాద్‌, తదితర నగరాలకు వెళ్లి శిక్షణ పొందలేకపోతున్నారు. ఇతర నగరాలకు వెళ్లి శిక్షణ పొందాలంటే కనీసం రూ.30 వేల నుంచి రూ. 50 వేలకు ఖర్చుఅవుతుంది. అద్దెలు, మెస్‌ చార్జీలు అదనం. ఈ స్థాయి ఆర్థిక భారాన్ని మోయలేక చాలామంది అభ్యర్థులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా స్థానికంగా దొరికే చిన్న ప్రైవేట్‌ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.

స్టడీ సర్కిళ్ల ఆవశ్యకత ఎంతో అవసరం..

మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని వల్ల నిరుద్యోగులకు నాణ్యమైన ఫ్యాకల్టీ లభించి ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ అందించడంతో ప్రతిభ కనబరుస్తారు. మార్కెట్‌లో వేల రూపాయలు పలికే ప్రామాణిక పుస్తకాలు ఉచితంగా లభిస్తాయి. ప్రశాంత వాతావరణంలో చదువుకోడానికి లైబ్రరీ, స్టడీ హాల్‌ వసతి, ల్యాబ్స్‌ సౌకర్యం ఉంటుంది. శిక్షణ కాలంలో విద్యార్థులకు కొంత మొత్తం స్టైఫండ్‌ ఇస్తే అభ్యర్థులకు మానసిక నిశ్చింత లభిస్తుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కోర్సుల్లో కూడా స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వొచ్చు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌, క్లాసులతో మైనార్టీ యువతలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అనుమతి వచ్చినా..

కెరీర్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు మైనార్టీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ నుంచి గత సంవత్సరం మార్చి 12వ తేదిన అనుమతి వచ్చింది. ఏదైనా ప్రభుత్వ భవనంలో సెంటర్‌ ఏర్పాటు చేయాలని మైనార్టీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెంటర్‌కు ఫర్నిచర్‌, కంప్యూటర్‌, తదితర మౌలిక వసతుల ఏర్పాటుకు రూ. రెండు లక్షల 86 వేలు కూడా మంజూరు చేసింది. మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలోని స్టాఫ్‌తో సెంటర్‌ రన్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే అధికారుల అలసత్వం కారణంగా కెరీర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ కూడా వెనక్కి పోయే ప్రమాదం పొంచి ఉందని మైనార్టీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మైనార్టీలకు స్టడీ సర్కిళ్ల కల నెరవేరేనా?

ఉద్యోగ వేటలో వెనుకబడుతున్న

నిరుద్యోగులు

భారంగా మారిన కార్పొరేట్‌ కోచింగ్‌ ఫీజులు

స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని

డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement